బస్టాండా... బందెల దొడ్డా

17 Jun, 2014 02:16 IST|Sakshi
బస్టాండా... బందెల దొడ్డా

 ఒంగోలు: ‘ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉంది. ఆర్టీసీ బస్టాండు అనుకుంటున్నారా..బందెల దొడ్డనుకుంటున్నారా..’ అని రాష్ట్ర రవాణ  శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండును సోమవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.  బస్టాండు ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహించారు. వేలాది మంది సంచరించే ప్రదేశం ఇంత అపరిశుభ్రంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది..దుమ్ము, ధూళి పేరుకుపోయింది..శుభ్రం చేస్తున్న దాఖలాలే కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అధికారులు పారిశుధ్య కార్మికులను పరుగులెత్తించారు.
 
 =    మరోవైపు బస్టాండు ఆవరణలో సీలింగ్ మొత్తం వైర్లు వేలాడుతూ చిందరవందరగా ఉండటాన్ని ప్రశ్నించగా..పెయింట్ వర్క్, మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు.
 =    కొణిజేడు బస్సులు ఆగే ప్రాంతంలో కనీసం షెల్టర్ లేకపోవడాన్ని గుర్తించి వెంటనే బస్టాండు ఎక్స్‌టెన్షన్‌కు ఎంతమేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించి తనకు పంపాలని ఆదేశించారు.
 =    స్టాల్స్‌లో కూడా పరిశుభ్రత కనిపించడం లేదని శిద్దా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో క్యాంటిన్‌కు ఇచ్చిన స్థానంలో ప్రస్తుతం వోల్వో కార్నర్ ఏర్పాటు చేస్తున్నామని, మిగతా భాగానికి సంబంధించి ఇటీవలే క్యాంటిన్ నిర్వహణకు టెండర్ ఖరారైంద ని అధికారులు తెలిపారు. త్వరలోనే వారు క్యాంటిన్ ప్రారంభిస్తారన్నారు. బస్టాండుకు పశ్చిమం వైపున టాయిలెట్ల నిర్మాణం పూర్తయిందని అవి కూడా ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు.
 =    బస్టాండు పల్లంలో ఉండటంతో వర్షాకాలంలో తీవ్ర సమస్యగా ఉందని అధికారులు తెలపగా..సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది..ఎంత మేర నిధులు అవసరమవుతాయో అంచనాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
 =    పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే సహించేది లేదని..కనీసం మంచినీరు కూడా సక్రమంగా, ఉచితంగా అందించలేకపోతే ఎలా అని ఆగ్రహించారు. పది రోజులు వేచి చూస్తానని ఈలోగా బస్టాండు వాతావరణం మొత్తం మారిపోవాలని మంత్రి సూచించారు. ఆయన వెంట ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.  
 
మంత్రి శిద్దాను కలిసిన ఒంగోలు డిపో మేనేజర్:
రవాణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావును సోమవారం ఉదయం ఆయన నివాసగృహంలో ఆర్టీసీ ఒంగోలు డిపో మేనేజర్ మురళీబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా పలు విషయాల గురించి ప్రశ్నించారు. ఒంగోలు నుంచి ముఖ్య ప్రాంతాలైన చెన్నై, వైజాగ్, తిరుపతికి ఎన్ని బస్సులు నడుపుతున్నారని ప్రశ్నించారు.
 
ఒంగోలు డిపో నుంచి ఆ ప్రాంతాలకు ఎటువంటి బస్సులు నడపడం లేదని, ఇతర డిపోలైన అద్దంకి, పొదిలి, చీరాల తదితర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు మేనేజర్ చెప్పారు. అది సరికాదని..ఒంగోలు నుంచి ఆ ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వోల్వో బస్సు ఉందా అని ప్రశ్నించగా లేదని..కందుకూరు నుంచి ఉందని మేనేజర్ చెప్పారు. ఇక నుంచి ఆ బస్సును ఒంగోలు నుంచే నడపాలని, ఆదాయంతో ముడిపెట్టి పల్లె వెలుగు బస్సులను నిలిపేయవద్దని మంత్రి ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు