ఆ... గంట అమూల్యం

31 Oct, 2017 11:35 IST|Sakshi
ర్యాలీ చేస్తున్న సిద్ధార్థ వైద్య కళాశాల సిబ్బంది, ప్రొఫెసర్లు

సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఆర్‌ శశాంక్‌

పక్షవాతానికి అందుబాటులో అత్యాధునిక చికిత్స

లబ్బీపేట(విజయవాడతూర్పు) : బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనప్పుడు మొదటి గంట ఎంతో అమూల్యమని, ఆ సమయంలో  కనీసం నాలుగు గంటల్లోపు ఆస్పత్రికి చేరితో ఎలాంటి వైకల్యం కలగకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌ శశాంక్‌ తెలిపారు. ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాస్పత్రి న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ శశాంక్‌ మాట్లాడుతూ ఒకప్పుడు పక్షవాతానికి గురైతే నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.  అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడంతో  వైకల్యాలకు గురికాకుండా చూడవచ్చని స్పష్టం చేశారు.  ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.చక్రధర్‌ మాట్లాడుతూ పక్షవాతం లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.  మెదడులో ఏ భాగానికి రక్త ప్రసరణ ఆగిపోతుందో ఆ భాగం నియంత్రణలో ఉండే అవయవాలు పట్టు తప్పుతాయన్నారు.  న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివాసులు మాట్లాడుతూ పక్షవాతం వచ్చిన రోగికి  తొలుత సీటీ స్కాన్‌ చేసి, రక్తనాళాల్లో గడ్డలు కారణంగా స్ట్రోక్‌ వచ్చిందా. రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చిందో గర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.  

రక్తపోటు అదుపులో పెట్టుకోవాలి....
జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ కంచర్ల సుధాకర్‌ మాట్లాడుతూ పక్షవాతం రావడానికి ప్రధాన కారణాలు రక్తపోటును అదుపులో పెట్టుకోక పోవడం, రక్తంలో గ్లూకోజ్‌ అదుపులో లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఆల్కాహాల్‌ అధిక మోతాదులో తీసుకోవడం, గుండెవ్యాధులు కలిగి ఉండటం, ముఖ్యకారణాలుగా పేర్కొన్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌లు డాక్టర్‌ ఎస్‌.బాబూలాల్, డాక్టర్‌ ఎవీ రావు, సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ కె.శివశంకర్‌రావు, డిప్యూటీ ఆర్‌ఎంవో డాక్టర్‌ నరసింహనాయక్, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పద్మావతి, మెడికల్‌ పీజీలు, నర్శింగ్‌ విద్యార్ధినిలు పాల్గొన్నారు.  ర్యాలీ రామవరప్పాడు రింగ్‌ వరకూ కొనసాగింది.

మరిన్ని వార్తలు