నిషేధిత సరుకుతో పట్టుబడ్డ ‘ఆంధ్రజ్యోతి’ వాహనం

2 Jun, 2020 11:28 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఆంధ్రజ్యోతి దిన పత్రిక రవాణా వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా బొమ్మలసత్రం రూరల్‌ పోలీసులు సోమవారం స్వాదీనం చేసుకున్నారు. సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కర్నూలుకు చెందిన వీరబ్రహ్మేంద్ర ఆచారి కొంతకాలంగా తుపాన్‌ వాహనంలో ఆంధ్రజ్యోతి దినపత్రిక కాపీలను రవాణా చేస్తున్నాడు. ఇదే క్రమంలో కర్నూలుకు చెందిన గుట్కా వ్యాపారి సుబ్బయ్యతో పరిచయం ఏర్పడటంతో అదే వాహనంలో గుట్కాపాకెట్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. సోమవారం తెల్లవారుజామున పత్రికల మధ్య రెండు గుట్కా ప్యాకెట్ల బస్తాలను దాచుకుని నంద్యాలకు బయలుదేరాడు.

డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ దివాకర్‌రెడ్డి సిబ్బందితో స్థానిక ఆటోనగర్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన వీరబ్రహ్మేంద్రఆచారి పోలూరు గ్రామం వైపు వాహనాన్ని మల్లించాడు. ఎస్‌ఐ తిమ్మారెడ్డి వాహనం వెంటపడటంతో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి చివరకు విఫలమయ్యాడు. నిందితున్ని విచారించగా పట్టణానికి చెందిన నాగేంద్రబాబుకు గుట్కాపాకెట్లు సరఫరా చేస్తున్నట్లు అంగీకరించాడు. వాహనంతో పాటు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.    చదవండి: గ్రామ వాలంటీర్ గొప్పతనం

ఆదోనిలో.. 
ఆదోని: కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా బండ్రాళు గ్రామానికి చెందిన మహాదేవన్‌ అనే గుట్కా వ్యాపారిని ఆదోని వన్‌ టౌన్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి రూ.21,000 విలువైన నిషేధిత గుట్కా పాకెట్లు, రూ.11,000 నగదు, బైక్‌ స్వా«దీనం చేసుకున్నారు. కొంత కాలంగా మహాదేవన్‌ పట్టణంలోని  వ్యాపారులకు నిషేధిత గుట్కాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో శిరుగుప్ప క్రాస్‌ రోడ్డు వద్ద నిఘా ఉంచి నిందితుడిని పట్టుకున్నామని వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు