బియ్యం నిల్వలు సీజ్

8 Aug, 2014 03:25 IST|Sakshi

 వేముల : ఎట్టకేలకు బెస్తవారిపల్లెలో బియ్యం నిల్వలను తహశీల్దార్ శివరామయ్య గురువారం సీజ్ చేశారు. దీంతో బియ్యం పంపిణీ కొలిక్కిరాలేదు. కాగా బియ్యం పంపిణీ చేయకపోవడంతో బుధవారం సర్పంచ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సంఘీభావంగా పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా తహశీల్దార్ శివరామయ్య గురువారం తాము బియ్యం పంపిణీ చేస్తామని హామీనిచ్చారు. ఈ హామీ మేరకు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు తహశీల్దార్ శివరామయ్య గురువారం సిబ్బందితో బెస్తవారిపల్లెకు వెళ్లారు. అక్కడ గ్రామంలో టీడీపీ నాయకుని ఇంటిలో అనధికారికంగా ఉన్న బియ్యాన్ని తరలించి దేవాలయం వద్ద బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
 
 అధికారులు బియ్యాన్ని తరలించేందుకు అక్కడికి వెళ్లగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి బియ్యం గింజను కూడా తీసుకపోనివ్వమని తహశీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కొందరు తమ నేతలకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు తహశీల్దార్‌కు ఫోన్ చేసి అక్కడ నుంచి బియ్యం తరలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించే ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది.
 
  దీంతో ఆయన టీడీపీ నేతల ఒత్తిళ్లతో ఎటూ తేల్చుకోలేకపోయారు. ఆర్డీవోకు సమాచారమిచ్చారు. ఈ పరిణామాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ నెలకొంది. పులివెందుల సీఐ మహేశ్వరరెడ్డి, వేముల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మరోపక్క బియ్యం నిల్వలను సీజ్ చేయకపోతే సర్పంచ్ లింగాల పార్వతమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తహశీల్దార్ బియ్యం నిల్వలను సీజ్‌చేసి వెళ్లిపోయారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు