సీఎం సభకు 12 వేల మంది విద్యార్థులు

19 Jan, 2015 04:53 IST|Sakshi

విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం విజయవాడలో నిర్వహించే స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమానికి 12 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం పర్యటనకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను క్రమశిక్షణతో విజయవంతం చేయాలని కోరారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి ఎస్‌డీసీ (స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల)లను ప్రారంభిస్తారని తెలిపారు.

దాదాపు 12 వేల మంది విద్యార్థులను ఇప్పటికే వివిధ కళాశాలల నుంచి ఆహ్వానించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులు పూర్తి క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో 17 కేంద్రాలతో నేరుగా ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రి సంభాషిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమానికి విద్యార్థులు మధ్యాహ్నం 12 గంటలకు హాజరవుతారని, వారికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ గంటా సుబ్బారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి, డీసీపీ అశోక్‌కుమార్, ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, టెక్నికల్ కోఆర్డినేటర్ లక్ష్మి, ఆర్‌ఐవో రాజారావు, సిద్ధార్థ కళాశాల సీఈవో రమేష్, తహశీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు.
 
సీఎం పర్యటన ఇలా...

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఆయన హెలికాప్టర్‌లో బయలుదేరి 12.15కు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దిగుతారు. మధ్యాహ్నం 12.20 నుంచి 12.45 వరకు పోలీసు శాఖ నూతన వాహనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటలకు మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీకి వెళతారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.55 వరకు సిల్క్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఇంటర్‌నెట్ ద్వారా ప్రారంభిస్తారు. సాయంత్రం 4.25కు  స్టేడియానికి చేరుకుని హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళతారు. సాయంత్రం 5 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళతారు.
 
రోశయ్య రాక

తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య సోమవారం ఉదయం 11 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 12.45కు గన్నవరం నుంచి ఆయన విమానంలో వైజాగ్ వెళతారు.
 

మరిన్ని వార్తలు