రాజకీయ దిగ్గజాల సిక్కోలు

23 Mar, 2019 09:39 IST|Sakshi

ఉత్తరాంధ్రలోనే పేరుమోసిన రాజకీయ ఉద్ధండులను అందించినదిగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి పేరుంది. అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమే అయినా రాజకీయాలకు మాత్రం చైతన్యవంతమైన గడ్డ అని చెబుతారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్రాత్మకమైన మూడు పాదయాత్రలు(2003లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 2013లో వైఎస్‌ షర్మిల, 2018–19లో వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి) ముగిసిన ఇచ్ఛాపురం ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. ఇక్కడ గెలిచినవారు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారనే పేరు కూడా ఉంది.  

ఇవీ ప్రత్యేకతలు
శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం ఉన్నాయి. ఇవన్నీ బీసీలు అత్యధికంగా ఉన్న స్థానాలే. కాళింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ, మత్స్యకార ఓటర్లే ఎక్కువ. ఇక వృత్తిపరంగా చూస్తే సన్న, చిన్నకారు రైతులే అధికం. ఇక్కడున్న ఉద్ధానం ప్రాంతానికి శ్రీకాకుళం కోనసీమగా పేరుంది. పొందూరు చేనేత, ఖద్దరు వస్త్రాలకు దేశవ్యాప్తంగా పేరొందింది. పలాసలో జీడిపప్పు పరిశ్రమ ఉంది. ఈ జిల్లా నుంచి వివిధ నగరాలకు, దేశాలకు ఉపాధి కోసం వలసలు ఎక్కువే. నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు ప్రవహిస్తున్నాయి.

ప్రస్తుత రాజకీయ పరిస్థితి
సిట్టింగ్‌ ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడి టీడీపీ పోటీలోకి దించింది. టెక్కలిలో కింజరపు కుటుంబానికి చిరకాల రాజకీయ ప్రత్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ వైఎస్సార్‌ సీపీ తరఫున బరిలోకి దిగారు. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు తప్పితే ఎంపీగా రామ్మోహన్‌ గత ఐదేళ్లలో ఏనాడూ.. ఏ గ్రామంలోనూ పర్యటించకపోవడంతో ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చివరకు తాను దత్తత తీసుకున్న సంతబొమ్మాళి గ్రామంలోనూ చెప్పుకోదగిన కార్యక్రమాలు చేపట్టలేదు. ఎంపీ ల్యాడ్స్‌ కింద ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు, అలాగే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు జిల్లాకు రావాల్సి ఉండగా.. వాటిలో కనీసం 15 శాతం నిధుల కోసం కూడా ఎంపీ ప్రతిపాదనలు చేయకపోవడం గమనార్హం. రైల్వే జోన్‌ విషయంలోనూ గట్టి పోరాటం చేయలేదనే విమర్శలు రామ్మోహన్‌పై ఉన్నాయి. గత ఐదేళ్లలో శ్రీకాకుళంకు తాను తెచ్చిన ప్రాజెక్టు అంటూ లేదు.

దూకుడుగా దువ్వాడ..
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో పోటీచేసిన దువ్వాడ శ్రీనివాస్‌ స్వల్ప తేడాతో రామ్మోహన్‌నాయుడి బాబాయి అచ్చెన్నాయుడి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అటు టెక్కలి స్థానంలో అచ్చెన్నకు, ఇటు ఎంపీ స్థానంలో రామ్మోహన్‌కు చెక్‌ పెట్టేందుకు దూకుడుగా దూసుకెళ్తున్నారు. శ్రీకాకుళం మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్, టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడం కలిసొచ్చే అంశం.

స్వతంత్ర అభ్యర్థులకూ ఆదరణ..
తొలిసారి 1952లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్‌ అభ్యర్థి పీఎల్‌ఎన్‌ రాజుపై గెలుపొందారు. తర్వాత బొడ్డేపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1957, 1962, 1971, 1977, 1980లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా  గెలిచారు. ఇదే బొడ్డేపల్లిపై 1967 ఎన్నికలలో గౌతు లచ్చన్న, 1967 ఉప ఎన్నికలో ఎన్‌జీ రంగా స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందడం విశేషం. నాలుగుసార్లు గెలిచిన ఎర్రన్నాయుడు, ఒకసారి గెలుపొందిన కిల్లి కృపారాణి కేంద్ర మంత్రులుగా పనిచేశారు.

అటకెక్కినబాబుహామీలు
2014 ఎన్నికలు, ఆ తర్వాత చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిచేయలేదు. పారిశ్రామిక రంగాన్ని విస్మరించారు. మత్స్యకారులు దీర్ఘకాలంగా ఫిషింగ్‌ హార్బర్‌ కోరుతుంటే.. భావనపాడు వద్ద పోర్టు నిర్మాణ పనులను ప్రైవేట్‌ సంస్థ ఆదానీకి అప్పగించారు. ఆముదాలవలస సహకార చక్కెర కర్మాగారం తెరిపించలేక పోయారు. ఇండస్ట్రియల్‌ పార్కు అతీగతీ లేదు. వ్యవసాయ ప్రాజెక్టుల పనులను పూర్తిచేయలేకపోయారు. లక్ష వరకూ కిడ్నీ రోగులున్న ఉద్ధానంలో వారికి స్వాంతన కలిగించేలా దీర్ఘకాలిక చర్యలేవీ చేపట్టలేకపోయారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో కూల్చేసిన కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణం పునాది దశను దాటలేదు. ఇక ఇచ్ఛాపురం నుంచి ఆముదాలవలస వరకూ టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇసుక అక్రమ రవాణానే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

దువ్వాడ శ్రీనివాస్‌ (వైఎస్సార్‌ సీపీ)
అనుకూల అంశాలు  :
జిల్లాలో వైఎస్సార్‌ సీపీ బలోపేతం కావడం. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు సొంత కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం. కింజరుపు కుటుంబాన్ని దీటుగా ఎదుర్కొనగలరనే పేరు ఉండటం. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతిపై ఆందోళనలు చేయడం.

రామ్మోహన్‌నాయుడు (టీడీపీ)
అనుకూల అంశాలు :తండ్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేయడం. ఎర్రన్నాయుడు అకాల మరణం చెందారనే సానుభూతి. ఒకసారి ఎంపీగా పనిచేయడం. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం ఉండటం.

బలహీనతలు
ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రజలను పట్టించుకోకపోవడం, కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు, సభలకే పరిమితం కావడం. శ్రీకాకుళం అభివృద్ధిలో విఫలం కావడం. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు సద్వినియోగం చేయకపోవడం. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధుల సాధనలో విఫలం కావడం.

వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధి
వైఎస్సార్‌ 2006లో రూ.వెయ్యి కోట్లు కేటాయించి వంశధార రెండో దశ నిర్మాణ, పునరావాస పనులను పరుగుపెట్టించారు. ఆయన దుర్మరణం తర్వాత అవన్నీ ఆగిపోయాయి. టీడీపీ  పూర్తి చేయలేదు.
టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో చివరి భూములకూ సాగు నీరు, పలాస పట్టణానికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మహేంద్ర తనయ నదీజలాలను సద్వినియోగం చేసుకోవడానికి రూ.127 కోట్లతో ఆఫ్‌ షోర్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో పనులు ఆగిపోయాయి.  
ఎచ్చెర్ల వద్ద అంబేద్కర్‌ వర్సిటీ, శ్రీకాకుళంలో బోధనాస్పత్రి రిమ్స్‌ నెలకొల్పారు.  
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల నుంచి రూ.2 వేల కోట్లకు పైగా నిధులతో ప్రధానమైన రహదారులన్నీ బాగుచేయించారు. 

మరిన్ని వార్తలు