గట్టెక్కించిన సీలేరు

9 Apr, 2018 08:18 IST|Sakshi

డెల్టాలో ఒడ్డున పడిన రబీ వరిసాగు

రికార్డు స్థాయిలో 66.056 టీఎంసీల రాక

కాలువలు మూసేనాటికి మరో 2 టీఎంసీలు

అమలాపురం : గోదావరి డెల్టాలో రబీ వరిసాగు గట్టెక్కింది. శివారుకు సకాలంలో సాగునీరందకున్నా.. గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి వృథా జలాలను కాలువల ద్వారా చేలకు మళ్లించకున్నా.. సొంతంగా మోటార్లు పెట్టుకున్న రైతులకు ప్రభుత్వం డీజిల్‌ ఖర్చులివ్వకున్నా.. మురుగునీటి కాలువలపై సకాలంలో క్రాస్‌బండ్లు వేయకున్నా.. చంద్రబాబు సర్కార్‌ పైసా విదల్చకున్నా.. డెల్టాలో రబీ పంట పండింది. 16 టీఎంసీల నీటికొరత ఉంటుందని అధికారులు చెప్పినా.. అంచనాలకు మించి నీరు రావడంతో రబీసాగు నీటి ఎద్దడికి ఎదురొడ్డి నిలిచింది. అదెలా సాధ్యమయ్యిందంటే.. ఎద్దడి సమయంలో గోదావరి డెల్టాలో రబీసాగును ‘సీలేరు’ ఎప్పటిలానే ఒడ్డున పడేసింది. ఈసారి రికార్డు స్థాయిలో ఆదివారం నాటికి ఏకంగా 66.056 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదలడం ద్వారా.. ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 7 లక్షల మంది రైతులకు జీవనాధారమైన రబీ సాగు నిర్విఘ్నంగా పూర్తయ్యింది.

నీటి ఎద్దడి ఉందన్నా..
ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజ్‌ దిగువన ప్రధాన పంట కాలువలకు ఈ నెల 10 నుంచి నీటి సరఫరాను నిలిపివేస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విçషయం తెలిసిందే. శివార్లలో సాగు ఆలస్యమైనందున మరో ఐదు రోజులు గడువు పొడిగించాలని రైతులు కోరుతున్నారు. రబీ సాగుకు ఈ ఏడాది ఎద్దడి తప్పని అధికారులు ముందే చెప్పారు. రబీ షెడ్యూలు కాలంలో తాగు, పారిశ్రామిక అవసరాలకు పోగా, కేవలం సాగుకు 83 టీఎంసీల నీరు అవసరమని, నీటి లభ్యత 67 టీఎంసీలు మాత్రమే ఉంటుందని తేల్చారు. అయినప్పటికీ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లాకు చెందిన మంత్రులు, అధికార పార్టీ పెద్దలు సూచించారు. కానీ, వివిధ పద్ధతుల్లో నీటి సేకరణకు ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా మంజూరు చేయించలేదు. తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా డెల్టాలో రైతులను, నీటిపారుదల అధికారులను గాలికి వదిలేశారు. దీంతో రైతులు ఉన్న నీటినే పొదుపుగా వాడుకొని రబీని గట్టెక్కించారు.

సీలేరు నుంచి రికార్డు స్థాయిలో నీటి సేకరణ
అధికారుల అంచనాలకు తగ్గట్టుగానే గోదావరిలో సహజ జలాలు తక్కువగా వచ్చాయి. గోదావరి సహజ జలాల అంచనా 24 టీఎంసీలు కాగా, ఆదివారం నాటికి 22.754 టీఎంసీల నీరు వచ్చింది. ఇది అధికారుల అంచనాకన్నా సుమారు ఒక్క టీఎంసీ తక్కువ. ఇదే సమయంలో మనకు సీలేరు నుంచి 49 టీఎంసీల వరకూ నీరు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి రబీ కాలంలో సీలేరు నుంచి మనకు వచ్చే నీరు 40 టీఎంసీలే. అత్యవసర పరిస్థితుల్లో బైపాస్‌ పద్ధతిలో మరో 5 టీఎంసీల వరకూ తెచ్చుకోవచ్చు. ఎందుకైనా మంచిదని సీలేరు నుంచి 49 టీఎంసీలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలకు మించి ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో ఏకంగా 66.056 టీఎంసీల నీరు సేకరించారు. కాలువలు మూసేనాటికి మరో రెండు టీఎంసీలు కలిపితే 68.056 టీఎంసీలు సీలేరు నుంచి సేకరించినట్టవుతుంది.

ఇప్పటికీ సీలేరు నుంచే..
డెల్టా ప్రధాన పంట కాలువలైన తూర్పు డెల్టాకు 1,825, మధ్య డెల్టాకు 1,190, పశ్చిమ డెల్టాకు 3,175 క్యూసెక్కుల చొప్పున మొత్తం 6,190 క్యూసెక్కుల నీరు ఇస్తున్నారు. దీనిలో సహజ జలాలు 1,032 క్యూసెక్కులు కాగా, సీలేరు నుంచి వస్తున్నది 5,158 టీఎంసీలు కావడం విశేషం. ఇప్పటికీ బైపాస్‌ పద్ధతిలో నీరు తీసుకువస్తున్నారంటే గోదావరి డెల్టాకు సీలేరు ప్రాధాన్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్‌ డ్రాప్‌ నుంచి అత్యధికంగా 4 వేల క్యూసెక్కులు, బైపాస్‌ పద్ధతిలో మరో 2 వేల క్యూసెక్కుల చొప్పున 6 వేల క్యూసెక్కులు సేకరించేవారు. కానీ ఈసారి ఏకంగా కొన్ని రోజుల పాటు 7,500 వరకూ సీలేరు నుంచి సేకరించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు