సీమాంధ్ర ప్రజా ప్రతినిధులది మోసం

22 Oct, 2013 02:16 IST|Sakshi

 

=తెలంగాణ ఏర్పాటు తథ్యమని తెలిసీ డ్రామాలు
=సీఎంపై చర్యలు తీసుకోకపోవడం దారుణం
=సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

 
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. మహబూబాబాద్‌లో సీపీఐ నియోజకవర్గ కార్యాలయ (వీరభవన్) నూతన భవనాన్ని, ధర్మన్న కాలనీలో ధర్మన్న పేరుతో నిర్మించిన ఆర్చీని, ధర్మన్న మైదానాన్ని సోమవారం ఆయన  ప్రారంభించారు. వీరభవన్‌లో అమరులైన కామ్రెడ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి బి.విజయసారథి అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని తెలిసిన సీమాంధ్రకు చెందిన నేతలు గుంటూరు, ప్రకాశంతోపాటు ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. మరోపక్క రాజకీయ లబ్ధి కోసం సమైక్య ఉద్యమం పేరిట సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రాష్ట్రం వీడిపోతే మూతిమీద మీసాలు తీయించుకుంటామని కొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటామని మరికొందరు, ప్రాణాలైన అర్పిస్తామని ఇంకొందరు ప్రగల్భాలు పలుకుతూ మోసం చేస్తున్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరును అక్కడి ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా డ్రామా ఆడుతూ పార్లమెంటరీ వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి కేబినెట్‌లో ఆమోదింపచేసినా... సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకించడం ఎంతవరకు సమంజసమన్నారు.

కాంగ్రెస్ నిర్ణయూనికి వ్యతిరేకంగా సీఎం పనిచేస్తున్నా...  పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సముద్రం లోతును తెలుసుకోవచ్చు గానీ... కాంగ్రెస్ లోతును తెలుసుకోవడం కష్టమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎవరూ అడ్డుపడినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ప్రజలు ఆశించిన రీతిలో జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడినా నిరుపేదల సమస్యలపై భూ పోరాటాలు... ఇతరాత్ర సమస్యలపై సీపీఐ ఉద్యమిస్తుందన్నారు.

భూ మండలం ఉన్నంతవరకూ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు సజీవంగా ఉంటాయని, అందుకు విప్లవ వీరుల త్యాగాలే కారణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిద్ధి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు మడత కాళిదాసు, జిల్లా సహాయ కార్యదర్శి తమ్మెర విశ్వేశ్వర్‌రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.అజయ్, పడాల దేవయ్య, రాజారెడ్డి, మోతిలింగారెడ్డి, మేకల రవి, నాయకులు పార్థసారథి, మేక వీరన్న, పెరుగు కుమార్, ఉప్పలయ్య, తోట విజయ్, పాండురంగాచారి, దాసరి పర్వతాలు, సాంబలక్ష్మి, వెంకన్న, ఐలయ్య, లింగ్య, ఆకుల రంజిత్, రంగ పాల్గొన్నారు. కాగా, కళాకారుల ఆటా.. పాట ఆకట్టుకుంది.
 

మరిన్ని వార్తలు