అక్షయ తృతీయ వేళ.. అపు‘రూప’ వీక్షణం

18 Apr, 2018 09:20 IST|Sakshi
అప్పన్న నిజరూపం (ఫైల్‌)

అప్పన్న నిజరూప దర్శనం నేడు

చందనోత్సవానికి విశేష ఏర్పాట్లు

వేకువజామున 4 గంటల నుంచి దర్శనాలు

సింహాచలం(పెందుర్తి) : చందనచర్చిత స్వామి నిజరూప దర్శన వేళ. సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని బుధవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకుని తరిస్తున్నారు.  ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు, భార్య సునీలా గజపతిరాజు, సుధా గజపతి రాజు, మాజీ ఎంపీ ప్రదీప్‌ చంద్రదేవ్‌ తదితరులు స్వామివారి తొలి దర్శనాన్ని చేసుకున్నారు.

మరోవైపు టీటీడీ నుంచి ఈవో అశోక్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, డాలర్‌ శేషాద్రి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్నకు చందనం, పట్టువస్త్రాలు సమర్పించగా, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి ఈఓ పద్మ పట్టువస్త్రాలు అందచేశారు. ఇక ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కుటుంబీకులు, హోంమంత్రి చినరాజప్ప, ఆయన కుటుంబసభ్యులు మంత్రి గంటా కుటుంబీకులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్నారు.

ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు
బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు ప్రారంభించారు. సుప్రభాత సేవ అనంతరం వెండి బొరుగుతో స్వామిపై ఉన్న చందనాన్ని ఒలిచారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు అందించారు. తదుపరి ఇతర ప్రముఖులకు దర్శనం అనంతరం తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులనుదర్శనాలకు అనుమతించారు.

రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం 
రాత్రి 9 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. గంగధార నుంచి 1000 కలశాలతో నీటిని తీసుకొచ్చి శ్రీ వైష్ణవస్వాములు నృసింహస్వామి వారి నిజరూపాన్ని అభిషేకిస్తారు. అనంతరం అర్చకులు తొలివిడత చందనాన్ని సమర్పిస్తారు. 

విధుల్లో 1200మంది పోలీసులు
చందనోత్సవాన్ని పురస్కరించుకుని పలు శాఖల సమన్వయంతో దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌ అధికారులు సన్నాహాలు చేశారు. నగర సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ రవికుమార్‌ మూర్తి ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 12 వందల మంది పోలీసులు చందనోత్సవ విధుల్లో ఉంటారని తెలిపారు. వారికి షిఫ్టులు కేటాయించామన్నారు. దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని బందోబస్తు నిర్వహించాలని సూచించారు. 

పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్‌ సృజన, కమిషనర్‌ హరినారాయణన్‌
సింహగిరిపై చందనోత్సవ ఏర్పాట్లను విశాఖ ఇన్‌చార్జి కలెక్టర్‌ సృజన పరిశీలించారు. ఆలయ నీలాద్రి గుమ్మం, దక్షిణ మార్గం, ఉత్తర ద్వారం, భక్తులు వేచి ఉండే క్యూలను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవం నిర్వహిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ కొండ దిగువన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

పకడ్బందీగా ఏర్పాట్లు : మంత్రి గంటా
చందనోత్సవంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు.  ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది  అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. 

బందోబస్తుకు చేరుకున్న పోలీసులు
చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు నిన్న సాయంత్రానికే సింహగిరికి చేరుకున్నారు. పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్‌ నుంచి ఎలాంటి వాహనాలు అడవివరం ప్రధాన రహదారిలో ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. 

చందనోత్సవ దర్శన సమయాలు

  • ఉచిత దర్శనం : తెల్లవారుజాము 4 గంటల నుంచి 
  • రూ.200, 500 టిక్కెట్ల దర్శనం :  ఉదయం 4గంటల నుంచి 
  • ప్రొటోకాల్‌ వీవీఐపీల దర్శనాలు :  ఉదయం 5 నుంచి 6గంటల వరకు, 8 గంటల నుంచి 9 గంటల వరకు 
  • రూ.1000 వీఐపీల దర్శనాలుః ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, సాయంత్రం 2 గంటల నుంచి 3 గంటల వరకు     
మరిన్ని వార్తలు