సండే స్పెషల్‌ ఇక డైలీ!

20 Jul, 2018 05:37 IST|Sakshi
నరసాపురం రైల్వేస్టేషన్‌లో నరసాపురం–హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌

డెల్టా, కోనసీమ వాసులకు ప్రయోజనం

త్వరలో నిర్ణయం ప్రకటించనున్న రైల్వే శాఖ

నరసాపురం స్టేషన్‌లో పెరుగనున్న రద్దీ

పశ్చిమగోదావరి , నరసాపురం: నరసాపురం రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి ఆదివారం హైదరాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును శాశ్వతంగా కొనసాగించాలని రైల్వేశాఖ భావిస్తోంది. రెండున్నర నెలలుగా నడుస్తున్న ఈ రైలులో విపరీతమైన రద్దీ ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు  వారం రోజుల్లో  తెలియజేస్తామని నరసాపురం రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ మధు తెలిపారు. ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాం తాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. గత మే 6 నుంచి ఈరైలు సర్వీస్‌ ప్రారంభమైంది. నిజానికి వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మే, జూన్‌ నెలల్లో ఈ రైలును నడపాలని ప్రవేశపెట్టారు. అయితే వేసవి ముగిసినా రద్దీ ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ స్పెషల్‌ రైలును ఆగస్ట్‌ నెలాఖరు వరకూ మరో రెండు నెలలుపాటు పొడిగించారు. అయితే రద్దీ తగ్గకపోవడంతో ఈ రైలును శాశ్వతంగా నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది.  ప్రతి ఆదివారం సా యంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్‌ చేరుకుంటుంది. నాలుగు జనరల్‌ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉండటంతో హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుంది.

డెల్టా, కోనసీమ వాసులకు ఉపయోగం
సింహాద్రి లింక్‌ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం నుంచి తొలగించి ఆరు మాసాలుగా నిడదవోలు నుంచి కొనసాగిస్తున్నారు. దీంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచే ట్రాక్‌ స్టేషన్‌లో ఖాళీగా ఉంటుంది. దీంతో ఈ ప్రత్యేక రైలును నరసాపురం నుంచి  ప్రవేశపెట్టడానికి వీలు చిక్కింది. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రిళ్లు నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్, పగలు నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ న డుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవ రం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూ ర్పుగోదావరి జిల్లా నుంచి కోనసీమ  ప్రాంతాల వారు హైదరాబాద్‌ చేరడానికి ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్‌ చేసుకున్నా ఈ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. పండుగలు, సెలవు రోజుల్లో మరింత రద్దీ ఉంటోంది. దీంతో వీకెండ్‌లో తిప్పుతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని శాశ్వతం చేసే యోచనలో రైల్వేశాఖ ఉంది.

మరిన్ని వార్తలు