సైకిల్‌కు మోగిన రెబెల్స్

20 Apr, 2014 01:46 IST|Sakshi
  •      టీడీపీకితిరుగుబాటు బెడద
  •      యలమంచిలి, పాడేరు,అరకులోయల్లో రగిలిపోతున్న శ్రేణులు
  •      బుజ్జగించినా మాట వినని సుందరపు
  •      రవిబాబుకు హ్యాండిచ్చిన చంద్రబాబు
  •  సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో సైకిల్‌కు చిక్కుముళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీని ధిక్కరించి రెబల్స్ మోగిస్తున్న గంటలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఊహించి నట్టుగానే యలమంచిలి,పాడేరు, అరకులోయల్లో రెబల్ అభ్యర్థులు పార్టీని ధిక్కరించి బరిలో నిలబడి సవాల్ విసిరారు. యలమంచిలిలో పంచకర్లకు టికెట్ ఇవ్వడంతో అలిగిన సుందరపు విజయ్ కుమార్ రెబల్‌గా నామినేషన్ వేశారు.

    రెండురోజుల ముందు తనకు అన్యాయం జరిగిందని ఆమరణ దీక్ష ప్రకటించిన సుందరపును గురువారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో బుజ్జగించారు. దీంతో సుందరపు దారికివచ్చినట్టేనని చంకలుగుద్దుకున్నారు. ఆయన మాత్రం బాబు బుజ్జగింపులను బేఖాతరుచేస్తూ శనివారం నామినేషన్ వేసి అసలు అభ్యర్థి పంచకర్లకు గొంతులో పచ్చివెలక్కాయపడేలా చేశారు. పాడేరు సీటును బీజేపీకి ఇచ్చి తమ గొంతుకోశారనే ఆగ్రహంతో ఉన్న ఆశావహ నేతలు రెబల్స్‌గా బరిలో నిలిచారు.

    మొన్నటికి మొన్న ప్రసాద్, నేడు కొట్టగుల్లి సుబ్బారావు రెబల్స్‌గా నామినేషన్ వేశారు. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అరకు టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుకు టీడీపీ చివరి నిమిషంలో హ్యేండ్ ఇచ్చింది. నామినేషన్లకు ఆఖరి రోజయిన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రవిబాబు మూడు రోజుల క్రితం ఇచ్చిన పార్టీ బి-ఫారంతో నామినేషన్ వేశారు. అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సివేరి సోమ మరో బి-ఫారంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

    ఈ పరిణామంతో అక్కడే ఉన్న రవిబాబుతోపాటు అతని వర్గీయులతో అవాక్కయ్యారు. ఆఖర్లో ఇలా అధినేత వెన్నుపోటు పొడవడాన్ని అక్కడి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈమేరకు రవిబాబు రెబల్‌గా మరో నామినేషన్ వేశారు. మరోపక్క టిక్కెట్లు దక్కని మాజీమంత్రి మణికుమారి అరకు పార్లమెంట్‌కు, గాజువాక నుంచి కోనతాతారావు రెబల్స్‌గా నామినేషన్ వేయడానికి పత్రాలు సిద్ధం చేశారు. కాని ఇంతలో పార్టీ ముఖ్యనేత నారాయణ వీరిని ఫోన్లో బుజ్జగించారు. పార్టీ పరువు బజారుకీడ్చొద్దని తాయిలాల ఎరవేశారు. దీంతోవీరు నామినేషన్ వేయకుండా ఉండిపోయారు.
     

మరిన్ని వార్తలు