జాగ్రత్త లేకపోతే డబ్బు గల్లంతే

19 Sep, 2019 10:33 IST|Sakshi

రహస్యంగా వివరాలు కొట్టేస్తారు

నకిలీ కార్డు సృష్టిస్తారు

అంతిమంగా ఏటీఎం నుంచి డబ్బు కొట్టేస్తారు

మీకు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ఉందా? అయితే అప్రమత్తంగా ఉండండి..  మీరు చూస్తూ ఉండగానే మీకు తెలియకుండా మీ వివరాలు కొట్టేసి మీ బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నాంటారు సైబర్‌ నేరగాళ్లు..  నకిలీ కార్డు ద్వారా నేరస్తులు ఈ అక్రమ లావాదేవీలతో వారి పని వారు కానిచ్చేసుకుంటున్నారు. డెబిట్‌ కార్డు వినియోగంపై జాగ్రత్త లేకుంటే మీ నగదు గల్లంతేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సాక్షి, ఒంగోలు సిటీ: డెబిట్‌ కార్డు తన వద్దే ఉంది. అయినా తన ఖాతా నుంచి రెండు పర్యాయాలు డబ్బు డ్రా అయింది. మొత్తం రూ.40 వేలకు పైనే డబ్బు తీసుకున్నారు. తన ఖాతా నుంచి తనకు తెలియకుండా డబ్బు ఎవరు తీశారో అర్థం గాక లబోదిబోమన్నాడు ముడియాల వీరాంజనేయులు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామానికి చెందిన ఆయన పామూరుకు వచ్చి ఏటీఎం వినియోగించారు. అపరిచిత వ్యక్తి ద్వారా తన డెబిట్‌ కార్డు నుంచి నగదు ఏటీఎం నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత తన ఖాతా నుంచి దఫాలుగా డబ్బు తనకు తెలియకుండానే డ్రా అయింది. తన ఖాతాలో ఉండాల్సిన మొత్తాన్ని కన్నా తగ్గడంపై కంగుతిన్నాడు. ఇది ఎలా జరిగిందో పోలీసులు విచారిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

జిల్లా నలుమూలల నుంచి సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులు వస్తూనే ఉన్నా యి. సైబర్‌ నేరస్తుల మాయాజాలంలో ఇదో సాధారణ పద్ధతి మాత్రమే అంటున్నారు పోలీసులు. ఖాతాదారు జేబులోనే డెబిట్‌కార్డు ఉన్నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలోని ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తున్నారు. డెబిట్‌ కార్డును ఉపయోగించే ఆ డబ్బు డ్రా అవుతోంది. నకిలీ కార్డు ద్వారా నేరస్తుల ఆ అక్రమ లావాదేవీని కానిచ్చేస్తారు. అందుకోసం నేరస్తులు స్కిమ్మింగ్, క్లోనింగ్‌ ప్రక్రియలను అవలంభిస్తున్నారు. కార్డుదారుల వివరాలను కొట్టేయడంలో కొన్ని ముఠాలకు చెందిన ఏజెంట్‌లు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఏఏ ప్రాంతాల్లో..
ఎక్కువగా డెబిట్‌ కార్డులను దుస్తుల దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పెట్రోలు బంకులు లాంటి ప్రాంతాల్లో వీటిని వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాలలో పని చేస్తున్న కొందరు వీలు చిక్కినప్పుడల్లా డెబిట్‌కార్డు వివరాలను చోరీ చేస్తున్నారు. తర్వా త ఆ వివరాలను అసలు నేరస్తులకు చేరవేస్తుం టారు. అనంతరం నకిలీ డెబిట్‌కార్డులను రూ పొందించి ఏటీఎం నుంచి నగదు కొట్టేస్తున్నారు.

అంతా తెలుసుకునేలోపే.. 
నగదు డ్రా అయిందని అంతా తెలుసుకునే లోపే ఏటీఎం నుంచి నగదు చోరీకి గురవుతుంది. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా అయినట్లుగా సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చినప్పుడు మాత్రమే అసలు విషయం బహిర్గతమవుతుంది. ఇప్పుడు కొన్ని బ్యాంకుల నుంచి నగదు తీసినా సంక్షిప్త సమాచారం రావడం లేదు. ఓటీపీలే కాలహరణం అయిన తర్వాత సెల్‌ఫోన్‌కు చేరుతున్నాయి. ఇక బ్యాంకు నుంచి నగదు అక్రమంగా డ్రా అయినా కొన్ని సందర్భాల్లో తెలిసే పరిస్థితి లేదు. విషయం తెలిస్తేనే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  డెబిట్‌ కార్డులపై ప్రతి ఒక్కరూ సంపూర్ణ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.

కార్డులో వివరాలు ఇలా కొట్టేస్తున్నారు
సాధారణంగా డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ లావాదేవీలే అధికం కానున్నాయి. రెస్టారెంట్లు, బార్లు, పెట్రోలు బంకులు, బట్టల దుకాణాలు ఇలా పలు చోట్ల బిల్లు కట్టాల్సి వస్తే డెబిట్, క్రిడిట్‌ కార్డులనే వినియోగించడం పరిపాటిగా మారింది. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ముఠాలు కార్డులోని వివరాలను కొట్టేయడానికి వివిధ మార్గాలను అనుసరిస్తున్నాయి. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాయి. కొందరు వెయిటర్లు, స్టివార్డులు తదితరులను ముఠాలు తమ ఏజెంట్లుగా ఎంపిక చేసుకుంటున్నారు. వారికి ఎరవేసి తమ దారికి వచ్చిన వారికి కార్డు రీడర్‌ (స్కిమ్మర్‌) యంత్రాన్ని అప్పగిస్తారు. సాధారణంగా వినియోగదారుని కార్డును స్వైపింగ్‌ యంత్రం (పీవోఎస్‌)లో పెడితే అందులోని వివరాలను యంత్రం రీడ్‌ చేస్తుంది.

దాని ఆధారంగానే కార్డుదారుని బ్యాంకు ఖాతా నుంచి అవసరమైన నగదు సంబందిత సంస్థ నిర్వాహకుని బ్యాంకు ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇక్కడే సైబర్‌ నేరస్తుల ముఠాకు చెందిన ఏజెంట్లు డేటాను తస్కరిస్తారు. ఈ ప్రక్రియనే స్కిమ్మింగ్‌ అంటారు. వివిధ స్వైపింగ్‌  కేంద్రాల్లో పీవోఎస్‌ యంత్రాలకే రహస్యంగా కార్డు రీడర్‌ను అమర్చుతారు. ఇదంతా అసలు నిర్వాహకులకు తెలియకుండా ఏజెం ట్లు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ యంత్రంలో వినియోగదారుడి కార్డు రీడ్‌ చేస్తే యాంత్రికంగానే ఏజెంటు రహస్యంగా అమర్చిన రీడర్‌లో కార్డు వివరాలన్నీ నిక్షిప్తమవుతాయి. అలా కొన్ని కార్డుల వివరాల్ని దొంగచాటుగా సేకరించిన తర్వాత ఏజెంట్‌ దగ్గర నుంచి కార్డ్‌ రీడర్‌ను అసలు నేరస్తులు తీసుకుంటారు. ఇందు కోసం ఉపయోగపడిన ఏజెంట్లుకు కమిషన్‌ ముట్టజెబుతారు.

► ఏజెంట్లు తెలివిగా వినియోగదారుల నుంచి కార్డు తీసుకుని లోపల స్వైప్‌ చేసుకొస్తామని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నెట్‌ వర్క్‌ సరిగ్గా లేదంటారు. సిగ్నల్స్‌ రావడం లేదు..బయటకు వెళ్తామంటారు. అక్కడే వినియోగదారులు ఏమరపాటుకు గురవుతారు. అజాగ్రత్తగా కార్డును తీసి అప్పగిస్తారు. అలాగే పిన్‌ నంబర్‌ చెప్పేస్తారు. అదే అదనుగా లోపలికి వెళ్లి సాధారణంగా పీవోఎస్‌ యంత్రంలో ఆ కార్డును రీడ్‌ చేస్తారు. సాధారణంగా బిల్లు అయిన మొత్తమే ఉపసంహరణకు గురైనట్లుగా వినియోగదారుడి సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వస్తుంది. ఆ మొత్తం సరిగ్గానే ఉండడంతో వినియోగదారునికి ఏ మాత్రం అనుమానం రాదు. కానీ ఆ తర్వాత సదరు ఏజెంటు స్కిమ్మర్‌లోనూ కార్డు రీడ్‌ చేస్తారు. కానీ ఈ సారి ఎలాంటి డబ్బు ఉపసంహరించడు. కాకపోతే కార్డు సమగ్ర వివరాలన్నీ మాత్రం స్కిమ్మర్‌లో నిక్షిప్తమవుతాయి. అప్పటికే పిన్‌ నంబర్‌ ఏజెంట్‌కు తెలుస్తుంది కాబట్టి అక్కడితో నేరస్తుల తొలి అంకం విజయవంతమవుతుంది.

► అలా కార్డు వివరాలను అసలు నేరస్తులకు అందిన తర్వాత రెండో అంకానికి తెర తీస్తారు. కార్డు సమగ్ర వివరాలు ఉంటాయి కాబట్టి కార్డు వివరాలను బట్టి క్లోనింగ్‌ ప్రక్రియ చేస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా అసలు కార్డులో వివరాలను నమోదు చేస్తారు. అలా నకిలీ కార్డు తయారవుతుంది. ఎలాగూ కార్డు పిన్‌ నంబర్‌ తెలిసి ఉంటుంది కాబట్టి ఏటీఎంలోకి వెళ్లి పిన్‌ నంబర్‌ను మార్చేసి వీలైనంత వేగంగా ఖాతాలోని నగదు ఏటీఎం నుంచి ఉపసంహరిస్తారు.

ఇలా జాగ్రత్త పడితే మేలు 
 ఎట్టి పరిస్థితిల్లో క్రిడిట్, డెబిట్‌ కార్డులు వాడేటప్పుడు వెయిటర్లు, స్టివార్డుల చేతికి వివరాలు అప్పగించవద్దు. 
 బిల్లు కట్టే సమయంలో కార్డులు లోపలికి తీసుకు వెళ్లి స్వైప్‌ చేస్తామంటే అంగీకరించ వద్దు. 
 రహస్యంగా ఉంచాల్సిన పిన్‌ నంబర్‌ను వారికి చెప్ప వద్దు. తాము కూర్చున్నచోటికే స్వైపింగ్‌ యంత్రాన్ని తీసుకు వచ్చి లావాదేవీ నిర్వహించమని చెప్పాలి. 
 తమ ఎదురుగానే స్వైప్‌ చేయాలని అడగాలి. ఆ సమయంలో కార్డు నంబర్, గడువు ముగింపు తేదీ, సీవీవీ నంబర్‌ను తస్కరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
 తరుచూ పిన్‌ నంబర్‌లను మారిస్తే మరింత అప్రమత్తంగా ఉండవచ్చు.

మరిన్ని వార్తలు