స్విమ్స్‌ డైరెక్టర్‌.. లుంగి డాన్స్‌!

3 Aug, 2017 08:33 IST|Sakshi

►టీటీడీ ఆడిటోరియంలో స్టెప్పులు
తిరుపతి : టీటీడీకి చెందిన సంస్థలో అపచారం చోటు చేసుకుంది. శ్రీవారి పాదాల చెంత కొలువై, దేవస్థానం ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)లో సాక్షాత్తు డైరెక్టర్‌ తన హోదా మరచి ఓ కార్యక్రమంలో ‘లుంగి డ్యాన్స్‌’ అనే పాటకు చిందులేయడం వివాదా స్పదమైంది. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో, చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇటీవల స్విమ్స్‌ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కేంద్రం వార్షికోత్సవాన్ని శ్రీపద్మావతి ఆడిటోరియంలో నిర్వ హించారు.

ముఖ్య అతిథిగా స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవికుమార్‌ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థినులతో కలసి  స్టెప్పు లేయడం చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. స్విమ్స్‌ ఆసుపత్రిలో అసభ్యకరమైన, పాశ్చాత్య సంస్కృతికి చెందిన కార్యక్రమాలకు స్థానం లేదు. ఆ సంస్థ వైన్స్‌ చాన్స్‌లర్, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారే ఈ విషయాన్ని విస్మరించి, వేదికపై శ్రీవారి విగ్రహం ఎదుటే ఏమాత్రం సంకోచించకుండా స్టెప్పులేశారు.


పాలనాపరంగానూ ఆరోపణలు
ఎన్‌ఆర్‌ఐ అయిన డాక్టర్‌ రవికుమార్‌ అధికార పార్టీకి చెందిన వైద్య శాఖ మంత్రికి సన్నిహితుడు. ఏడాది క్రితం డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆరంభంలో కొన్ని పాలనా పరమైన సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తర్వాత అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన నిర్ణయాలను సైతం అధికార పార్టీకి చెందిన అధికారులకు అప్పగించడం, తరచూ సెలవులో విదేశాలకు వెళ్లడంతో స్విమ్స్‌లో పాలన అటకెక్కింది.

సీనియర్లను కాకుండా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తికి ఫర్‌ఫ్యూజనిస్ట్‌గా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించారు. ఫైనాన్స్‌ కమిటీ అప్రూవల్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనుమతి లేకుండానే ఈ నియామకం పట్ల సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 151 జీవో ప్రకారం కనీస వేతనాలు చెల్లించడం లేదు. ఓ మహిళకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించి క్వార్టర్స్‌ కేటాయించడంపై విమర్శ లున్నాయి. దీనిపై స్విమ్స్‌ డైరెక్టర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

>
మరిన్ని వార్తలు