కరుణించు వరుణదేవా..! 

19 Jul, 2019 09:16 IST|Sakshi
వరుణయాగం చేస్తున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి  

శింగనమలలో వరుణయాగం ప్రారంభం

పూజలు చేసిన ఎమ్మెల్యే పద్మావతి దంపతులు 

సాక్షి, శింగనమల: వరుణుడి కరుణ కోసం శింగనమలలోని ఆత్మారామాలయంలోని తలంబ్రాల మండపంలో శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో గురువారం వరుణయాగాన్ని ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. బొడ్రాయికి పూజలు చేసి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉడిపి నుంచి వచ్చిన వేద పండితులు వరుణయాగాన్ని ప్రారంభించారు.


హోమం నిర్వహిస్తున్న వేద పండితులు  

పంచగవ్య సిద్ధి,  పుణ్యాహ వచనం, పర్జన్య జపం, కంకణ బంధనం, గుణయాగం, నవగ్రహ హోమం,  నవగ్రహ జపం, రుత్విక్‌ యాగం చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.  

తరలివచ్చిన భక్తజనం 
శింగనమలలో నిర్వహిస్తున్న వరుణయాగానికి శింగనమల, గార్లదిన్నె, బీకేఎస్, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాలతో పాటు జిల్లా కేంద్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు.   

మరిన్ని వార్తలు