సిండి‘కేట్ల’ గుప్పిట్లో మద్యం వ్యాపారం

20 Mar, 2016 05:09 IST|Sakshi
సిండి‘కేట్ల’ గుప్పిట్లో మద్యం వ్యాపారం

ఎంఆర్‌పీ ఉల్లంఘనపై కమిషనర్ సీరియస్
చర్యలకు తటపటాయిస్తున్న అధికారులు
ధరల నియంత్రణ అమలు చేయాల్సిందే : డిప్యూటీ కమిషనర్
క్రాస్ చెకింగ్ కోసం టీంల ఏర్పాటుకు ఆదేశం

 
 కర్నూలు: జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి అన్ని రకాల మద్యం సీసాలపై రూ.20 నుంచి రూ.40 వరకు ధర పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల గూళ్యంలో మద్యం దుకాణంపై దాడి చేసి ధరల ఉల్లంఘనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలూరులో సీఐగా పనిచేస్తూ శాఖాపరమైన చర్యల్లో భాగంగా మాదవరం చెక్‌పోస్టుకు ఇటీవలే బదిలీ అయిన సీఐ మహేష్‌కుమార్‌పై ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో మొత్తం 209 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. గత ఏడాది జులై నుంచి కొత్తవారికి అనుమతులిచ్చారు. కొంతకాలం నిర్ణీత ధరలకే విక్రయాలు జరిపిన వ్యాపారులు స్థానికంగా ఎక్సైజ్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

మద్యం వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండటంతో స్థానికంగా ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులకు వంత పాడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే  మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కమిషనర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రస్థాయిలో బృందాలు జిల్లాకు తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తుండటంతో జిల్లాస్థాయి ఎక్సైజ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. కొంతకాలంగా యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను కట్టడి చేయడం ఎక్సైజ్ అధికారులకు కష్టసాధ్యంగా మారింది.
 
 అధికారుల చర్యలు ఫలించేనా:
 ఎక్సైజ్ కమిషనర్ హెచ్చరికల నేపథ్యంలో డిప్యుటీ కమిషనర్ నాగలక్ష్మి ధరల నియంత్రణ అమలుపై దృష్టి సారించారు. శనివారం కర్నూలు, నంద్యాల ఇన్‌చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హెప్సీబా రాణి, ఫయాజ్‌లతో పాటు సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్‌పీ ఉల్లంఘనపై చర్చించారు. ఎక్కడైనా సిండికేట్లకు వంత పలికితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రాస్ చెకింగ్ కోసం టీములను ఏర్పాటు చేశారు. ఒక సర్కిల్ పరిధిలోని దుకాణాలను మరో సర్కిల్ పరిధిలోని అధికారులు తనిఖీలు చేసి ఎంఆర్‌పీ ఉల్లంఘన బయటపడితే కేసులు నమోదు చేసే విధంగా నిర్ణయించారు.

ఎంఆర్‌పీ ధరల ఉల్లంఘన వ్యవహారంలో సీఐ మహేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు భయం ఒకవైపు అధికారుల్లో ఉన్నప్పటికీ  వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో నిక్కచ్చిగా ధరల నియంత్రణ అమలు చేయడానికి తటపటాయిస్తున్నారు. స్థానిక అధికారుల సహకారం లేకుండా జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు అమలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది.    
 

మరిన్ని వార్తలు