తెలంగాణ బిల్లు పెట్టకుంటే 22 నుంచి సింగరేణి సమ్మె

10 Aug, 2013 03:52 IST|Sakshi

టీబీజీకెఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య
 గోదావరిఖని,న్యూస్‌లైన్: పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని, లేనిపక్షంలో ఈ నెల 22 నుంచి సింగరేణి సంస్థలో సమ్మె చేపడతామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య  పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇప్పటికే సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు.
 
 పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టని పక్షంలో సమ్మెను విజయవంతం చేసేందుకు మిగిలిన కార్మిక సంఘాలు కలిసిరావాలని కోరుతూ  సంఘాలకు లేఖలు రాస్తున్నామని చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు కుట్ర పన్నుతున్నారని, వాటిని కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే పరిమితమై మాట్లాడడం శోచనీయమన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో సీఎంను గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు