ఏళ్ల తరబడి సింగిల్‌ రోడ్డే!

3 May, 2019 12:59 IST|Sakshi
సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి సింగిల్‌ రోడ్డులో రెండు వాహనాలు ఎదురెదురుగా రావడానికి ఇబ్బందులు పడుతున్న దృశ్యం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూపు రేఖలు మారని సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి మార్గం

సూళ్లూరుపేట–శ్రీకాళహస్తికి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి సింగిల్‌రోడ్డుగానే ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనాల డ్రైవర్లు భయపడిపోతున్నారు. ఈ రోడ్డు మార్జిన్‌లో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు పక్కకు దిగితే లారీల యాక్సిల్‌ లేదా కట్టలు ఎక్కడవిరిగిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు.

మన్నారుపోలూరు (సూళ్లూరుపేట): సూళ్లూరుపేట–శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ దాకా అంటే 19.5 కిలోమీటర్లు రోడ్డు నాలుగు దశాబ్దాలుగా సింగిల్‌ రోడ్డుగా ఉంది. పదేళ్ల క్రితం ఈ రోడ్డుపై అంతగా ట్రాఫిక్‌ ఉండేది కాదు. ఇప్పుడు రోజూ సుమారు 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చెన్నై–కోల్‌కత్తా ఏషియన్‌ రహదారి నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా పరిధిలో  13.5 కిలోమీటర్లు రోడ్డు చిత్తూరు జిల్లా పరిధిలో ఉంది. ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా ఈ రోడ్డుపై ఇటీవల సర్వే చేశారు. రోజుకు 7 వేల నుంచి 10 వేల వాహనాల దాకా వెళుతున్నట్టుగా సర్వేలో తేలింది. నాలుగు వేల వాహనాలు దాకా తిరిగితే దాన్ని డబుల్‌ రోడ్డుగా మార్చాలనే నిబంధనలున్నాయి. సూళ్లూరుపేట ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేచేసి సుమారు రూ.30 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఈ రూట్‌పై ట్రాఫిక్‌ పెరిగినా అందుకు తగినట్టుగా డబుల్‌రోడ్దు వేయాలనే ఆలోచన ఈ రెండు జిల్లాల అధికారులు,  పాలకుల్లో కలగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్‌ రోడ్డు కావడంతో ప్రమాదాల సంఖ్య పెరిగింది.  ఇటీవల ఈ మార్గంలో నాలుగు కంపెనీలు ఏర్పాటు చేశారు.  ఎన్‌టీర్‌ స్వగృహ పథకం కింద పక్కాఇళ్లు నిర్మిస్తుండడంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ మరింత పెరిగింది. ఈ మార్గంలో రాత్రిళ్లు ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గంలో గ్రామాలూ ఎక్కువే
సూళ్లూరుపేట నుంచి  శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో గ్రామాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సూళ్లూరుపేట మండలంలోని మన్నారుపోలూరు, ఇలుపూరు, పెరిమిటిపాడు, కొండుంబట్టు, మంగళంపాడు, దామానెల్లూరు, మతకామూడి, ఉగ్గుమూడి, సుగ్గుపల్లి గ్రామాల ప్రజలే కాకుండా చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం, సంతవేలూరు, కువ్వాకొల్లి,  పాదనవారిపాళెం, అయ్యవారిపాళెం, కళత్తూరు, వరదయ్యపాళెం, మరదవాడ, బుచ్చినాయుడుకండ్రిగ గాజుల పెళ్లూరు, బుచ్చినాయుడుకండ్రిగ, నీరుపోకకోట, కాంపాళెం, కుక్కంబాకం గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండానే సూళ్లూరుపేటకు రాకపోకలు సాగిస్తున్నారు. అపాచి కంపెనీకి వెళ్లే కార్మికులు ఈ గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో పలుమార్లు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ మార్గంలో జరిగిన ప్రమాదాలను ఏడాదిగా తీసుకుంటే సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మంది  మంది క్షతగాత్రులయ్యారు.

మంత్రి హామీలు నీటి మూటలేనా!
గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ ఓ మారు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా విస్తరించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నానని సూళ్లూరుపేటలో జరిగిన ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఈ రోడ్డులోనే మున్సిపాలిటీ అధికారులు ఎన్‌టీఆర్‌ స్వగృహకు సంబంధించిన ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఇళ్లు నిర్మాణాలను పరిశీలించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ పలుమార్లు ఈ మార్గంలో తిరిగినా రోడ్డు ఇలా ఉందేమిటి అని అధికారులను అడిగిన దాఖలాల్లేవు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టీడీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, పరసా రత్నం సీఎంకు పలుమార్లు విన్నవించామని, ఆయన టేబుల్‌మీద ఫైల్‌ పెట్టామని చెబుతూనే కాలం వెళ్లదీశారు.   

నరకం కనిపిస్తోంది
 సూళ్లూరుపేట నుంచి మన్నారుపోలూరు వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. ఈ మార్గంలో నాలుగు కంపెనీలు రావడంతో పాటు ఎన్‌టీఆర్‌ గృహాలు రావడంతో ట్రాఫిక్‌ పెరిగింది. దీనికి తగినట్టుగా రోడ్డు విస్తరణ  చేయలేకపోయారు. టీడీపీ పాలకులు ఈ రోడ్డువైపు కనీసం కన్నెత్తి చూడలేదు.– శిరసనంబేటి కృష్ణారెడ్డి,వెలగలపొన్నూరు

భయంగా వెళ్లాల్సి వస్తోంది
సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి మార్గంలో మోటార్‌సైకిల్‌పై భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది. బుచ్చినాయుడుకండ్రిగ దాకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తోంది. నేను చిన్నప్పటినుంచి చూస్తున్నా సింగిల్‌రోడ్డుగానే వదిలేశారు. మోటార్‌ సైకిల్‌పై వెళుతున్నపుడు ఎదురుగా వాహనం వస్తే కనీసం కిందకు దిగేందుకు కూడా వీలు లేకుంగా గుంతలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల రాకపోకలు క్షేమంగా సాగాలంటే డబుల్‌రోడ్డు వేయాల్సిందే.– హరీష్, సూళ్లూరుపేట

మరిన్ని వార్తలు