ప్లాస్టిక్కే.. పెనుభూతమై..

30 Oct, 2019 05:11 IST|Sakshi

ఆందోళన కలిగిస్తున్న సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణానికి పెనుముప్పు

జీవరాశి ఆరోగ్యానికి తీవ్ర హాని

ప్లాస్టిక్‌ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయడమే మార్గం

ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ముఖ్యమే

మనదేశంలో రోజుకు పోగవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు 26,000 టన్నులు

ఒక రైలు టికెట్‌ భూమిలో కలిసిపోవడానికి పట్టే సమయం 2 వారాలు

ఒక ప్లాస్టిక్‌ నీళ్ల సీసా భూమిలో కలిసిపోవడానికి పట్టే సమయం 450 సంవత్సరాలు

ప్లాస్టిక్‌ భూతం మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. నదీ, సముద్ర జలాలను కలుషితం చేస్తూ జీవరాశి ప్రాణాలను హరిస్తోంది.. భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతోంది భూమిలో వందల ఏళ్లపాటు తిష్ట వేసి భూసారాన్ని పీల్చి పిప్పి చేస్తూ పంటల దిగుబడిని దెబ్బతీస్తోంది.. కాలుస్తుంటే గాలిని కలుషితం చేస్తూ వ్యాధులకు దారితీస్తోంది.. ఆకాశాన్నంటుతున్న కాలుష్యంతో భూతలం మీద జీవుల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తోంది.. మన దైనందిన జీవితంలో భాగంగా మారిన ప్లాస్టిక్‌ కలిగిస్తున్న పెనుముప్పు ఇది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి ఒక్కరు ఏడాదికి సగటున 11 కిలోల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను వాడుతున్నారు. ఈ లెక్కన మన దేశంలో 130 కోట్ల జనాభా ఏడాదికి 1,430 కోట్ల కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. దేశంలో తలసరి ప్లాస్టిక్‌ వినియోగం ఏడాదికి 2022 నాటికి 20 కిలోలకు, 2025 నాటికి 25 కిలోలకు చేరుతుందని అంచనా. కాగా.. అమెరికాలో ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 109 కిలోలు, చైనాలో 38 కిలోలు వినియోగిస్తున్నారు.  

సాక్షి, అమరావతి: ఉదయం లేచాక ఇంటికి టిఫిన్‌ తెచ్చుకోవడం నుంచి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు, పండ్లు, పిల్లలకు చిరుతిండ్లు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ల వరకు.. మరెన్నో రకాలుగా లెక్కకు మిక్కిలిగా సింగిల్‌ యూజ్‌ (ఒకసారి వాడి పారేసేది) ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులు మన ఇంటిలో చేరుతున్నాయి. మన దేశంలో రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడుతున్నాయని అంచనా. ఇందులో మున్సిపాలిటీలు, పంచాయతీలు సేకరించని వ్యర్థాలు దాదాపు 10 వేల టన్నులు. అంటే.. ఆ వ్యర్థాలన్నింటినీ రీసైక్లింగ్‌ చేయడం లేదు. వీటికి అదనంగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్, ఆహార పదార్థాల డెలివరీ యాప్‌ల ద్వారా నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు అదనంగా చేరుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ మన కాలనీల్లో, ఊళ్లల్లో, రోడ్ల పక్కన, పర్యాటక ప్రదేశాల్లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కొన్నాళ్లకు కాలువలు, చెరువులు, నదులు, సముద్రాల్లో చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8 మిలియన్ల ప్లాస్టిక్‌ ముక్కలు సముద్ర జలాల్లో కలుస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 2050 నాటికి సముద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని ఎలన్‌ మెక్‌థన్‌ ఫౌండేషన్‌ అంచనా వేసింది. 

చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
2016లో కేంద్రం రూపొందించిన ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం.. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు స్థానిక సంస్థలు బాధ్యత వహించాలి. రోజువారీ వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా విభజించి ఇంటింటికీ వెళ్లి సేకరించడం, వాటిని రీసైక్లింగ్‌ చేయడం, అనంతరం మిగిలిన వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం చేయాలి. ఈ నిబంధనలకు 2018లో కేంద్రం సవరణలు చేసి ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెదజల్లే సంస్థలనే బాధ్యులను చేసింది. రీసైక్లింగ్‌ చేయడానికి వీలులేని మల్టీలేయర్‌ ప్లాస్టిక్‌ (చిప్స్‌ ప్యాకెట్లకు వాడేది)ను రెండేళ్లలో పూర్తిగా నిషేధించాలి. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను కేంద్రం రెండేళ్లపాటు వాయిదా వేసింది. దేశంలో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్, 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించినా అమలు సక్రమంగా లేదు. చాలా రాష్ట్రాల్లో తూతూమంత్రంగా సాగుతోంది. 

ప్రభుత్వాలు ఏం చేయాలి? 
- సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తిని నిషేధించాలి. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి.
- ప్లాస్టిక్‌ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి హాని కలిగించే సంస్థలకు భారీ జరిమానాలు విధించాలి. ప్యాకింగ్‌ అవసరాల కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి.
- సిక్కిం దేశంలోనే తొలిసారిగా 1998లోనే సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించింది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి.. సమర్థంగా అమలు చేస్తోంది. సిక్కింను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. 

ప్రజలు ఏం చేయాలి? 
- ఇళ్లల్లో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలి.  రాగి, గాజు నీళ్ల సీసాలు వాడాలి. 
పాలు, ఇతర పదార్థాలు, వస్తువుల ద్వారా వచ్చే ప్లాస్టిక్‌ కవర్లను చెత్తతో కలిపి పారేయకుండా ఒకచోట ఉంచి నెలకోసారి వాటిని పాత సామాన్లు, పాత పేపర్లు కొనేవారికి విక్రయించాలి. ఇలా చేస్తే వాటి రీసైక్లింగ్‌ సాధ్యమవుతుంది.  
-  మార్కెట్‌కు వెళ్లేటప్పుడు చేతి సంచీ తీసుకెళ్లడంతోపాటు వాహనాల్లోనూ ఓ సంచీ పెట్టుకోవాలి.

సంప్రదాయ, దేశీయ విధానాలే ఉత్తమం..
ప్లాస్టిక్‌ భూతాన్ని పారదోలాలి అంటే మనం పాత పద్ధతులనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గతంలో ఫంక్షన్లలో భోజనాలకు ఆకులతో చేసిన విస్తర్లు/అరటి ఆకులు వేసేవారు. సరుకుల ప్యాకింగ్‌కు పాత పత్రికలు, చిత్తు కాగితాలు వాడేవారు. విస్తర్లు, పేపర్‌ కవర్ల తయారీ కుటీర పరిశ్రమగా ఉండి ఎంతోమందికి స్వయం ఉపాధి లభించేది. అదేవిధంగా జనపనార ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచాలి. 

కొద్ది రోజుల కిందట తమిళనాడులో ఒక ఆవు అనారోగ్యంతో ఉండటంతో దాని యజమాని వెటర్నరీ అండ్‌ యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా పరిశీలించిన వైద్యులు దాని కడుపులో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయని తేల్చారు. ఏకంగా ఐదు గంటలపాటు ఆవుకు శస్త్రచికిత్స నిర్వహించి ఆ వ్యర్థాలను బయటకు తీశారు. అవి ఏకంగా 52 కిలోలు ఉండటం చూసి నివ్వెరపోయారు. రోడ్లపై ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎలా పెరిగిపోతున్నాయనేదానికి, ఎలాంటి అనర్ధాలు సంభవిస్తాయి అనేదానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.

ప్లాస్టిక్‌తో నష్టాలెన్నో.. 
- నదులు, సముద్ర జలాల్లో కలిసే ప్లాస్టిక్‌ వ్యర్థాలను చేపలు, కొన్ని అరుదైన తాబేళ్లు, తిమింగలాలు తిని మరణిస్తున్నాయి.  విషతుల్యమైన చేపలను తిని ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
- వేడి ఆహార పదార్థాలు, పానీయాలను తినడానికి, తాగడానికి వాడే ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసుల నుంచి కరిగిన ప్లాస్టిక్‌ మన శరీరంలోకి వెళ్తోంది. దీనివల్ల చర్మ, జీర్ణకోశ సమస్యలు, థైరాయిడ్, గొంతు నొప్పి సంభవిస్తున్నాయి. 
- ప్లాస్టిక్‌ను కాలుస్తుండటంతో తీవ్ర వాయు కాలుష్యం విడుదలై శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో చేరడంతో భూగర్భ జలాలు కలుషితమై మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. 
- ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమి పొరల్లో వందల ఏళ్లు ఉండిపోతుండటంతో భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా 8 లక్షల తాబేళ్లు, 10 లక్షల సముద్ర పక్షులు, మరెన్నో చేపలు మృత్యువాత పడుతున్నాయి.

 ప్లాస్టిక్‌ రహిత జిల్లాయే లక్ష్యం
విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మూడు నెలల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చాం. క్రెడాయ్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో రైతు బజార్లు, మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా కృష్ణా జిల్లాను తీర్చిదిద్దడమే మా లక్ష్యం.
– ఇంతియాజ్, కలెక్టర్, కృష్ణా జిల్లా

 సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తి నిషేధించాలి
సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తిని ప్రభుత్వం నిషేధించాలి. అన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు తగిన మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని, మార్కెటింగ్‌ను పెంచాలి.
– మనోజ్‌ నలనాగుల, పర్యావరణ శాస్త్రవేత్త

 ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించాలి
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. అడ్డాకులతో చేసిన విస్తర్లు, ప్లేట్లు, కాగితాల కవర్లు, జనపనార ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్‌కు ప్రభుత్వాలు కృషి చేయాలి. దీంతో ఎంతోమందికి స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. 
– జేవీ రత్నం, గ్రీన్‌ క్‌లైమేట్‌ సంస్థ ప్రతినిధి

సమన్వయంతోనే సమర్థంగా..
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధం కోసం 2008లో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాం. విద్యాసంస్థలు, మార్కెట్లు, కూరగాయల బజార్లతోపాటు ఇంటింటికీ తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మూడేళ్లలోనే బొబ్బిలి మున్సిపాలిటీని ప్లాస్టిక్‌ రహితంగా చేయగలిగాం. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనిచేస్తే రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేదాన్ని సమర్థంగా అమలు చేయొచ్చు. 
– రాజగోపాల్‌ నాయుడు, అమ్మ ఫౌండేషన్, బొబ్బిలి

ప్లాస్టిక్‌ను తినేసే బ్యాక్టీరియా 
ప్లాస్టిక్‌ వ్యర్థాల ముప్పును శాశ్వతంగా తొలగించడానికి ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. స్పెయిన్‌లోని కాంటాబ్రియా యూనివర్సిటీలో బయోమెడిసిన్‌– బయోటెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను తినే చిన్న పురుగులను గుర్తించారు. అయితే.. ఆ పురుగులపై ఎంతవరకు ఆధారపడొచ్చు.. వాటితో ఇతర సమస్యలేమైనా తలెత్తుతాయా అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు