సింగోటం జాతర.. చూసొద్దాం వేడుక

18 Jan, 2019 13:24 IST|Sakshi
సింగోటం జాతరకు ఇంజిన్‌ బోట్లలో తరలి వెళ్తున్న భక్తులు

మూర్వకొండ ఘాట్‌ వద్ద భక్తుల తాకిడి

బోట్ల ఫిట్‌నెస్‌పై తహసీల్దార్, సీఐ పరిశీలన   

మొదటి రోజు 375 మంది భక్తులు, 64 బైకుల తరలింపు

కర్నూలు , పగిడ్యాల: తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్‌ తాలుకా సింగోటంలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరునాల సందర్భంగా శుక్రవారం నిర్వహించే రథోత్సవంలో పాల్గొనేందుకు గురువారం మూర్వకొండ ఘాట్‌ నుంచి భక్తులు తరలివెళ్లారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ కృష్ణానది మీదుగా మూర్వకొండ ఘాట్, అర్లపాడు ఘాట్‌ నుంచి ఇంజిన్‌ బోట్లలో భక్తులు ఆవలి ఒడ్డున ఉండే మంచాలకట్ట, చెల్లపాడు గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మూర్వకొండ ఘాట్‌ భక్తులతో కళకళలాడింది. వీఆర్వోలు అక్కడే ఉండి జాతరకు వెళ్తున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. మొదటి రోజు గురువారం మూర్వకొండ ఘాట్‌ నుంచి 375 మంది భక్తులు, 64 బైకులు, అర్లపాడు ఘాట్‌ నుంచి 28 మంది భక్తులు, 7 బైకులును తరలించినట్లు డిప్యూటీ తహసీల్దార్‌ జోగన్న తెలిపారు.

ఈ సందర్భంగా మూర్వకొండ ఘాట్‌ను తహసీల్దార్‌ జాకీర్‌ హుశేన్, నందికొట్కూరు రూరల్‌ సీఐ వెంకటరమణ మూర్వకొండ ఘాట్‌ వద్దకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. ఇంజిన్‌ బోట్ల ఫిట్‌నెస్‌పై ఆరా తీశారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని బోట్లను అనుమతించినట్లు తెలుసుకున్న అధికారులు ఘాట్‌ నిర్వాహకులపై మండిపడ్డారు. వైజాగ్‌ ఫోర్ట్‌లో దరఖాస్తు చేసినా ఇంకా రాలేదని ఘాట్‌ నిర్వాహకులు సమాధానం చెప్పడంతో త్వరలో తెచ్చుకోవాలని ఆదేశించారు. రథోత్సవం రోజు శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లే అవకాశం ఉన్నందున కనీసం 20 ఇంజిన్‌ బోట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  బోట్లలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని, డీజిల్, ట్యూబ్‌లు, లైఫ్‌జాకెట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 2007 ఘటన పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒక్కో బోటుపై 20 మంది ప్రయాణీకుల కంటే ఎక్కువగా అనుమతించరాదని సూచించారు. 

మరిన్ని వార్తలు