సింగూరు జలాల విడుదల

2 Mar, 2014 04:00 IST|Sakshi

నిజాంసాగర్, న్యూస్‌లైన్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయం నుంచి టర్బయిన్ గేట్ ద్వారా శనివారం ఉదయం 1,360 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వరద గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేయనున్నారు. ఏడుపాయల దుర్గామాత ఉత్సవాలు, ఘనపూర్ ఆనకట్ట అవసరాల కోసం సింగూరు జలాశయం ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు టర్బయిన్ గేట్ ద్వారా వదులుతున్న నీరు మంజీర నదిలో ప్రవహిస్తోంది. అందులో భాగంగానే నిజాంసాగర్ ప్రాజెక్టుకు 7 టీఎంసీల నీటిని సింగూరు జలాశయం వరద గేట్ల ద్వారా వదలనున్నట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.
 నిజాంసాగర్ ప్రాజెక్టు, ఆయకట్టు పంటల అవసరాల కోసం సింగూరు జలాశయం నుంచి నీటి విడుదలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒప్పించారు. ప్రభుత్వం మెమో విడుదల చేసి పదిహేను రోజులైనా సింగూరు ప్రాజెక్టు అధికారులు మాత్రం జలాశయం నుంచి నీటిని విడుదల చేయలేదు.

మరోసారి జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి ప్రభుత్వం దృష్టికి  తీసుకెళ్లగా ఎట్టకేలకు జలాలు విడుదలకానున్నాయి. సింగూరు ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయనుండటంతో మంజీర పరీవాహక ప్రాంతానికి రైతులు,పశువుల కాపరులు వెళ్లవద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 522.339 మీటర్లతో 23.277 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1,398.88 అడుగులతో 10.189 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

మరిన్ని వార్తలు