రూ. 18,000 కోట్ల పెట్టుబడులు..47,000  మందికి ఉపాధి

8 Mar, 2020 06:23 IST|Sakshi

25 భారీ పెట్టుబడులకు ఎస్‌ఐపీసీ సూత్రప్రాయ ఆమోదం 

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థలు 

నూతన పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వాలని నిర్ణయం   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు రూ.18,000 కోట్ల విలువైన 25 భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దాదాపు 47,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రిటైల్, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ కంపెనీలకు కొత్త పారిశ్రామిక విధానం ప్రకారం రాయితీలు ఇవ్వాలని నిర్ణయించారు.

- హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ సంస్థ చిత్తూరు జిల్లాలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న అడిదాస్‌ బ్రాండ్‌ పేరిట పాదరక్షల తయారీ యూనిట్‌కు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలియజేసింది. ఈ ఒక్క యూనిట్‌ ద్వారానే 10,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
- ఇంటెలిజెంట్‌ గ్రూపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లాలో అపాచీ సెజ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  
జపాన్‌కు చెందిన అయన్స్‌ టైర్స్‌ గ్రూపు రూ.1,600 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ఏర్పాటు చేయతలపెట్టిన టైర్ల తయారీ యూనిట్‌కు ఎస్‌ఐపీసీ ఆమోదం లభించింది. 
- ఈ యూనిట్‌లో భారీ వాహనాలు.. ముఖ్యంగా రైతులు, అటవీ, గనుల తవ్వకం వంటి రంగాల్లో ఉపయోగించే యంత్రాలకు వినియోగించే టైర్లు తయారవుతాయి.
తూర్పుగోదావరి జిల్లాలో ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,700 కోట్లతో ఏర్పాటు చేయనున్న కాస్టిక్‌ సోడా తయారీ యూనిట్‌కు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలిపింది. ఈ యూనిట్‌ ద్వారా 1,300 మందికి ఉపాధి లభించనుంది. 
చిత్తూరు జిల్లాలో టీసీఎల్‌ టెక్నాలజీ, రేణిగుంట సమీపంలోని ఈఎంసీ1, 2లో మొబైల్‌ తయారీ కంపెనీలకు చెందిన పలు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీసీ ఆమోదం తెలియజేసింది. 
- కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ.3,675.24 కోట్లు పెట్టుబడులతో ఏకంగా 32,890 మందికి ఉపాధి లభించనుంది. 

మరిన్ని వార్తలు