సైసైరా నరసింహారెడ్డి

28 Oct, 2017 08:58 IST|Sakshi
సై సైరా నరసింహారెడ్డి నాటకం రిహార్సల్స్‌

29న సాయంత్రం ప్రదర్శన  

నంది నాటకోత్సవాల్లో ప్రదర్శనకు సిద్ధం  

కర్నూలు(కల్చరల్‌) : విప్లవ వీరుడు నరసింహారెడ్డి తెల్ల దొరలకు వ్యతిరేకంగా జరిపిన చారిత్రాత్మక పోరాటాన్ని సై సైరా నరసింహారెడ్డి పేరుతో నాటకంగా రూపొందించామని టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నాటకానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 87 నంది అవార్డులు పొందిన ప్రముఖ రచయిత, పల్లేటి కులశేఖర్‌ రచించిన ఈ నాటకాన్ని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రదర్శించనున్నామని తెలిపారు. సురభి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నాటకం ప్రేక్షకులను అలరింపజేస్తుందన్నారు.

ఈ నాటకాన్ని భవిష్యత్తులో 13 జిల్లాలలో ప్రదర్శించనున్నామని తెలిపారు. రాబోయే నంది నాటకోత్సవాల్లో సైతం ఈ నాటకాన్ని ప్రదర్శించడానికి అంతా సిద్ధం చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న రంగస్థల కళాకారుల సమావేశంలో నాటక అకాడమి చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొననున్నారని, ఈ సందర్భంగా రంగస్థల కళాకారుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే నాటక ప్రదర్శనను నాటకాభిమానులు  తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.  

ఆకట్టుకున్న రిహార్సల్స్‌...
సైసైరా నరసింహారెడ్డి నాటకానికి సంబంధించిన రిహార్సల్స్‌ స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వారం రోజులుగా జోరుగా సాగుతున్నాయి. నాటకంలో నరసింహారెడ్డి, తహసీల్దార్‌ రాఘవాచారి, జాన్‌పీటర్, కాక్రేన్‌ దొర మధ్య జరిగే సన్నివేశాలను రసవత్తరంగా తీర్చిదిద్దుతున్నారు.   నొస్సం కోటను పేల్చడం, నరసింహారెడ్డి ట్రెజరీపై దాడి చేయడం లాంటి ఆకర్షణీయమైన దృశ్యాలు ఉన్నాయి. దర్శకుడు పత్తి ఓబులయ్య, నాటక రచయిత కులశేఖర్, సంగీత దర్శకుడు రామలింగం, గంగాధర్, సుజాత.. ఈ నాటకాన్ని అత్యంత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా