సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికలు

26 Nov, 2013 00:45 IST|Sakshi

 కాగజ్‌నగర్ రూరల్/మంచిర్యాట టౌన్, న్యూస్‌లైన్ :
 సిర్పూర్ పేపర్ మిల్లులో ఎన్నికల నగారా మోగింది. మంచిర్యాలలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ కోదండపాణి సమక్షంలో సోమవారం యాజమాన్యం, తొమ్మిది కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల తేదీని ప్రకటించారు. యాజమాన్య ప్రతినిధులు బీఎల్ శర్మ, సురేందర్‌లతోపాటు తొమ్మిది యూనియన్ల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్ 11న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణ, అదేరోజు కౌంటింగ్ నిర్వహించేందుకు నిర్ణయించారు. కంపెనీలో 1640 ఓటర్లు ఉండగా మెజార్టీ సాధించిన వారిని గుర్తింపు యూనియన్‌గా ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మిల్లులో తొమ్మిది యూనియన్లు రికార్డులను కార్మికశాఖకు అందజేయగా గుర్తులను కేటాయించారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు సోమవారం నిర్వహించిన సమావేశంలోనే ఉపసంహరణ ఉండగా ఏ ఒక్క యూనియన్ కూడా ఉపసంహరించుకోలేదు. దీంతో మిల్లులోని తొమ్మిది యూనియన్లు బరిలో నిలిచాయి. మిల్లులో గుర్తింపు యూనియన్ కాలపరిమితి 2012 మార్చితో ముగియగా సుమారు 20 నెలల అనంతరం ఎన్నికల నిర్వహణకు తెరలేచింది.
 
  మంచిర్యాలలో జరిగిన సమావేశంలో 9 కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసాద్, రాజన్న, విశ్వేశ్వర్‌రావు, రషీద్, లక్ష్మయ్య, రాంచందర్, మురళీ, తిరుపతి, భూపాల్‌రావు, శ్రీనివాస్‌లతో పాటు కంపనీ ప్రతినిధులైన బిఎల్.శర్మ, వెంకటేశ్‌గౌడ్, సురేందర్‌నాథ్‌లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు