విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణ ప్రారంభం

1 Nov, 2019 16:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలను విచారించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ శుక్రవారం నుంచి తన విచారణను ప్రారంభించింది. విచారణ బృందానికి మాజీ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తుండగా, మాజీ ఐఏఎస్‌ అధికారిణి అనూరాధ, రిటైర్డ్‌ జడ్జి భాస్కరరావు సభ్యులుగా ఉన్నారు. అక్టోబరు 26న సిట్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్‌ ఎరీనా థియేటర్‌ వద్ద బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుల స్వీకరణకు పదమూడు బృందాలను నియమించగా, ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్‌, ఇద్దరు సహాయకులు ఉంటారు.

బాధితులు వివరాలను సిట్‌ రూపొందించిన నిర్ణీత ఫార్మాట్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఫార్మాట్‌తో పాటు ఆధారాలను సిట్‌ ఏర్పాటు చేసిన టేబుల్‌ వద్ద అందజేయాలి. బాధితులకు సహాయంగా ఆరు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. 13 మండలాలకు ఒకటి చొప్పున 13 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారు దరఖాస్తుతో పాటు భూమికి సంబంధించిన దస్తావేజుల జిరాక్స్‌ కాపీలను జతచేయాలి. ఒరిజినల్స్‌ సైతం తీసుకెళ్లి, అధికారులకు చూపించాలి. నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇష్టపడని వారికోసం ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలోనే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే ఎన్నారైల కోసం vizagcollectorate.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. బాధితుల అనుమానాల నివృత్తికి 1800-42500002, 0891-2590100 నంబర్లను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు