సిట్‌ చుట్టూ రాజకీయ ఉచ్చు !

7 Nov, 2018 08:03 IST|Sakshi

జగన్‌పై హత్యాయత్నం కేసును తేల్చేసేందుకు పథకం

కుట్ర కోణాన్ని పట్టించుకోని పోలీసులు

అన్యమనస్కంగా కస్టడీ పిటిషన్‌

సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టే జరుగుతోంది. సిట్‌విచారణ అటకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ చదరంగంలో సిట్‌ పావుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్‌ బాస్‌ డైరెక్షన్‌లో విచారణను ముగించేయడానికి కసరత్తు చేస్తున్నట్లు  పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కుట్ర కోణాన్ని వెలికి తీయకుండా.. సూత్రదారులను గుర్తించకుండానే విచారణను ముగించేందుకు  సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఆరోపణలను తప్పించు కోవడానికేపిటిషన్‌
ఇప్పటికే కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతుండడంతో కస్టడీ పొడిగింపు పిటిషన్‌ వేసినట్టు పోలీసు వర్గాల్లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసును కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తుందేమోనని సిట్‌ వర్గాలు ఎదురు చూశాయి. విచారణను 9వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు వేచి చూసి, కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపో తే సాధ్యమైనంత త్వరగా కేసు క్లోజ్‌ చేసేందుకు పథక రచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

టీడీపీ నేతల జోలికెళ్లక పోవడంపైఅనుమానాలు
ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును సాధ్యమై నంత త్వరగా ముగించేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. టీడీపీనేత ప్రమేయం కళ్లకు కట్టినట్టుగా కన్పిస్తున్నా సిట్‌ విచారణ ఆ దిశగా సాగడం లేదు.  ప్రభుత్వ పెద్ద నుంచి వచ్చిన ఆదేశాల కనుగుణంగానే దీపావళి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఈ కేసును క్లోజ్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనకు వెళుతూ సోమవారం విశాఖలో సీపీ లడ్డా, సిట్‌ను పర్యవేక్షిస్తున్న నయీమ్‌ తదితర పోలీస్‌ అధికారులతో భేటీ అయి విచారణ వివరాలను తెలుసుకుని కేసును ఎలాకొలిక్కి తీసుకు రావాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఇక హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని సిట్‌ అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ప్రజలు, మీడియాలో వ్యతిరేక వార్తలు రావడంతోనే మరోసారి కస్టడీ పొడిగింపు పిటిషన్‌ వేశామని చెబుతున్నారు.

పిటిషన్‌ పేరుతో డ్రామా
 నిందితుడు తమ కస్టడీకి కావాలనుకున్నప్పుడు పోలీస్‌ అధికారులు న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్లాలి. ఇక్కడ మాత్రం పిటిషన్‌ వీగి పోవాలనే ఉద్దేశంతోనే  అసంపూర్ణంగా వేసినట్టు తెలుస్తోంది. మరో వైపు  నిందితుడ నుంచి రాబట్టాల్సిన విషయాలు ఏమీ లేవని..మిగిలిన కోణాల్లో దర్యాప్తు సాగించి సాధ్యమైనంత త్వరగా చార్జి షీట్‌ఫైల్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నామని ఓ సిట్‌ అధికారి ‘సాక్షి’ తోచెప్పారు. ఇలాంటి కేసుల్లో సాధారణంగా అరెస్ట్‌ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే చార్జి షీట్‌ ఫైల్‌ చేస్తామని, ఇది  ప్రత్యేక కేసు కావడం వల్లే అన్ని కోణాల్లోదర్యాప్తు చేయాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు.

ఒత్తిళ్ల వల్లే పక్కదారి
రెండు నెలల కిందట వరకు కేవలం లేఖ ఇచ్చేందుకే సిద్ధమయ్యాడని, కానీ ఉన్నట్టుండి ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్న అధికారులు సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారు.   ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకు అటు వైపు చూడడం లేదు.  

టీడీపీ నేత హర్షవర్ధన్‌ను అర్ధరాత్రి దాటే వరకు విచారించిన మరుసటి రోజు నుంచి సిట్‌ విచారణ జోలికి సీపీ లడ్డా రాలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల మేరకే సీపీ ఈ కేసు విషయంలో అంటిముట్టనట్టుగా ఉన్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. నిందితుడు శ్రీనివాస్‌ పక్కా ప్రణాళికతోనే హత్యాయత్నం చేశాడని స్పష్టమవుతోంది. పైగా టీడీపీ నేత హర్షవర్ధన్‌ యాజమాన్యంలో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేసేందుకు కోనసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు సిఫార్సు చేసినట్టుగా చెబుతున్నారు.ఇక శ్రీనివాస్‌కు లేఖ రాసి సహాయం చేసిన రేవపతిపతి ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ సిఫార్సుతో చేర్పించినట్టు పోలీసులే గుర్తించారు.

కుట్ర ఉందని గుర్తించినా మౌనం
హర్షవర్ధన్, ఆయన హోటల్‌లోసూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రామకృష్ణలు శ్రీనివాస్‌ను చేరదీయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌వోసీ ఇప్పించి మరీ హోటల్‌లోకి తీసుకోవడం జగన్‌కు కాఫీకి బయట నుంచి రానీయకుండా అడ్డుకోవడం.. పథకం ప్రకారం శ్రీనివాస్‌ను పంపి హత్యాయత్నానికి పాల్పడడం చూస్తుం టే ఇదంతా పక్కా స్కెచ్‌ ప్రకారమే జరిగిందని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో టీడీపీ నేతల ప్రమేయం ఉందని కళ్లెదుట కన్పిస్తున్నా వారి జోలికి వెళ్లే సాహయం చేయలేకపోతున్నారు. గడిచిన నాలుగు రోజులుగా ఎలాంటి విచారణ సాగడం లేదు. పూర్తిగా రికార్డు వర్కుకే పరిమితమవడం ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తోంది.

>
మరిన్ని వార్తలు