సీతా.. ఎంత మారిపోయావ్‌రా!

13 Feb, 2018 03:42 IST|Sakshi
తల్లి కల్పకంతో సీతారాం ఏచూరి

భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టు సుదీర్ఘ కాలం తర్వాత తనయుడిని చూసిన ఆ తల్లి సంబరపడిపోయింది. ‘సీతా.. ఎలా ఉన్నావ్‌రా?’ అంటూ ఆప్యాయంగా ముద్డాడింది. చిన్న పిల్లాడికి తినిపించినట్టు కంచంలో అన్నం తెచ్చి కొసరి తినిపించింది. ఎన్నో కబుర్లు చెప్పింది. ఏమిటిదంతా అనుకుంటున్నారా?

భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ ఏపీ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కొద్ది విరామం దొరికింది. దీంతో ఆయన పార్టీ నేత బి.బలరాంకు మనసులో మాట చెప్పారు. ‘మా అమ్మను చూసి చాలాకాలం అయింది. ఒక్కసారి కాకినాడ వెళ్లి చూసొస్తా..  వాహనం ఏర్పాటు చేయగలరా?’ అని కోరారు. దానికాయన ‘మీరు వెళ్లటం ఎందుకు? అమ్మనే ఇక్కడకు (భీమవరం) తీసుకొద్దాం’ అని చెప్పగా ఏచూరి సున్నితంగా తిరస్కరించారు. తానే వెళ్లొస్తానని ఆదివారం కాకినాడ బయల్దేరారు. కాకినాడ కుళాయిచెరువు సమీపంలోని గాంధీపార్క్‌ వద్ద తన ఇంటికి వెళ్లే సమయానికి ఏచూరి మాతృమూర్తి కల్పకం పూజ చేస్తున్నారు. ఏచూరి రాక గురించి తెలియటంతో ఆమె వచ్చి.. ‘సీతా, ఎలా ఉన్నావ్‌ రా.. ఎంత మారిపోయావ్‌’ అంటూ కౌగిలించుకున్నారు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ‘ఎలా ఉన్నావమ్మా? మావయ్య వాళ్లు ఎలా ఉన్నారు?’ అంటూ ఏచూరి వాకబు చేశారు. భోజనం అనంతరం తిరిగి భీమవరం బయల్దేరారు.

మరిన్ని వార్తలు