పేరు పార్ట్‌ టైం.. పని ఫుల్‌ టైం

2 Jul, 2019 08:56 IST|Sakshi

ఆర్ట్, వర్క్, వృత్తి విద్య ఇన్‌స్ట్రక్టర్ల వెతలు 

హెచ్‌ఎంల ఒత్తిడితో చేయక తప్పని పరిస్థితి

ప్రభుత్వ పాఠశాలల్లోని ఆర్ట్, వర్క్, వృత్తి విద్య పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి (పీటీఐ) దయనీయంగా ఉంది. పేరుకు పార్ట్‌ టైం అయినా వారంతా ఫుల్‌ టైం పనిచేయాల్సి వస్తోంది. కేవలం మధ్యాహ్న వేళల్లో సహపాఠ్య కార్యక్రమాలు బోధన చేయించాలని వీరిని నియమించగా వీరు రోజంతా పని చేయాల్సి వస్తోంది. పాఠశాలల్లోని హెచ్‌ఎంల ఆదేశాలుతో వీరు పని చేయక తప్పడంలేదు. అరకొర జీతం..ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేయాలంటే తాము ఎలా బతకాలని ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  - కంచరపాలెం (విశాఖ ఉత్తర)

విద్యాహక్కు చట్టం–2009లో భాగంగా 6,7,8 తరగతుల విద్యార్థులకు సృజనాత్మకత, పనిపట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్, వర్క్, వృత్తి విద్య బోధించడానికి పార్ట్‌ టైం ఇన్‌స్ట్రక్టర్లు (పీటీఐ)ను సర్వశిక్ష అభియాన్, రాజీవ్‌ విద్యా మిషన్‌ నియమించాయి. 2012లో ఈ నియామకాలు జరిగాయి. పీటీఐల నియామక సమయంలో పార్ట్‌టైం విధానం అయినా పూర్తికాలం పని చేయించారు. ఈ సమస్యపై 2014లో కొంత మంది పార్ట్‌టైం బోధకులు అప్పటి రాష్ట్ర సంచాలకులుగా ఉన్న వి.ఉషారాణిని సంప్రదించారు.

ఆమె ఒక జీవోను విడుదల చేశారు. పార్ట్‌టైం బోధకులతో కేవలం మధ్యాహ్న వేళల్లో మాత్రమే ఒక్క పూట బోధన చేయించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మరే ఇతర పనులకు గాని,  పాఠశాలలో ఇతర సబ్జెక్టుల బోధనకు గాని వినియోగించరాదని జీవోలో స్పష్టంగా సూచించారు. కేవలం పీటీఐలను సహపాఠ్యాంశాల బోధనకు మాత్రమే వినియోగించాలని ఆదేశాలిచ్చారు. కానీ అది అమలు మాత్రం జరగడం లేదు.
 
హెచ్‌ఎంల ఒత్తిళ్లు 
జిల్లా పరిషత్, జీవీఎంసీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పార్ట్‌టైం బోధకులను రోజంతా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి పలుమా ర్లు వీరు తమ గోడును వి ద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లా రు. 2014–15లో విద్యాశాఖా ఇచ్చిన ఉత్తర్వులను చూపించినా హెచ్‌ఎంలు పట్టించుకోవడంలేదు. పీటీఐలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తికాలం పనిచేయాలని ఆదేశిస్తూ మానసికంగా ఒత్తిడి తెస్తున్నారని ఇన్‌స్ట్రక్టర్లు ఆరోపిస్తున్నారు. అలా చేయని యడల రీఎంగెజ్‌మెంటుపైన, డ్యూటీ సర్టిఫికెట్లపై హెచ్‌ఎంలు సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నార న్న ఆరోపణలు ఉన్నాయి.

జీవీఎంసీ పరిధిలో కొంత మంది హెచ్‌ఎంలు మరో అడుగు ముందుకేసి రెండుపూటలా పనిచేస్తేనే..లేకుంటే ఉండనవసరం లేదని బెదిరింపులకు దిగుతున్నారని ఇన్‌స్ట్రక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సమస్యపై ఆ యూనియన్‌ నాయకులు సంప్రదింపులు జరిపినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. సమస్య ఉన్న పాఠశాలల్లో యూనియన్‌ నాయకులు పలుమార్లు హెచ్‌ఎంను కలిసి చెప్పినా వారు వినిపించుకోవడంలేదు. ప్రాజెక్ట్‌ అధికారిని కలిసి చెబితా వారు నోటి మాట చెప్పి వదిలేస్తున్నారు. హెచ్‌ఎంలకు స్పష్టమైన ఆదేశాలు మాత్రం ఇవ్వడంలేదు. అసలే చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న పీటీఐలు మిగతా సమయంలో మరో చోట పనిచేసుకోవడానికి హెచ్‌ఎంలు అవకాశం ఇవ్వడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.

480 మంది ఇన్‌స్ట్రక్టర్లు 
జిల్లాలో 480 మంది పార్ట్‌టైం బోధకులు ఉన్నారు. వీరంతా నెలకు రూ.14వేల వేతనంతో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలతో పీటీఐలు పని చేయాల్సి వస్తోంది. వీరిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ఉదయం వేళల్లో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేటు కార్యాలయాల్లో పనిచేస్తూ ఉండడం కనిపిస్తోంది. 

కటువుగా ప్రవరిస్తున్నారు
మేం పాఠశాలలో రోజంతా పనిచేయలేం. అరకొర జీతంతో మేం ఎలా బతకాలి. ప్రభుత్వ విధివిధానాలు సక్రమంగా అమలు చేయడంలో హెచ్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం పనిచేస్తున్నా హెచ్‌ఎంలు కటువుగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నాం. విద్యాశాఖాధికారులు సరైన నిర్ణయం తీసుకుని పార్ట్‌టైం ఉద్యోగులకు మేలు చేయాలి.
– బి.నవీన, ఆర్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌  

ఉత్తర్వులివ్వాలి  
ఆర్ట్,వర్క్‌ ఇన్‌స్ట్రక్టర్లకు ఒకపూట పనిచేయాలనే నిబంధన ఉన్నా కొంత మంది హెచ్‌ఎంలు పూర్తి కాలం పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు పూటల పనిచేయాలని ఉత్తర్వులు వస్తే మేం చేస్తాం. అంతేతప్ప ఇచ్చే జీతం తక్కువ, చేసే పని ఎక్కువ అయితే మేం వేగలేం. దీనిపై స్పష్టత అవసంర. 
  – బి.శంకర్, ఆర్ట్‌ ఇన్‌స్ట్రక్టర్, పీటీఐల యూనియన్‌ నాయకుడు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా
పీటీఐలు ఒకపూటే పని చేయాలనే జీవో 2014లో విద్యాశాఖాధికారులు జారీ చేసిన మాట వాస్తవమే. పీటీఐల జీతాలు పెరిగిన తరువాత కొన్ని పాఠశాలలో హెచ్‌ఎంలు రెండుపూటల పాఠశాలలకు రావాలనే కోరుతున్నారనే సమస్య మా దృష్టికి వచ్చింది. సమస్యను జిల్లా ప్రాజెక్టు అధికారి సలహాతో రాష్ట్ర ఎన్‌పీడీ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అప్పటివరకు పీటీఐలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మాటలకు అనుగుణంగా పనిచేసుకుంటే ఉద్యోగులకు మేలు జరుగుతుంది.   
– అలుగుబిల్లి శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌ఏ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి, ఆర్వీఎం 

మరిన్ని వార్తలు