అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రణరంగం

16 Dec, 2013 11:14 IST|Sakshi
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రణరంగం

హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఇరు ప్రాంత నేతలు ఒకరినొకరు తోసుకోవటంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనీసం బీఏసీని కూడా పిలవకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను తగులబెట్టారు. దీంతో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి...వారిని  అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 
 

గండ్రకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడు కావటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సాక్షిగా ఈ దాడి జరిగింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి జరగడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ధర్మాన కృష్ణదాసు అభివర్ణించారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులే బాధ్యత వహించాలన్నారు.
 

జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మీడియా పాయింట్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఏ ఒక్కరూ వినే పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీలో కూడా సమైక్యతీర్మానం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీడియాతో మాట్లాడనీయకుండా అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నాలు చేశారు.

>
మరిన్ని వార్తలు