మూడింటిలోనూ ఉద్ధండులే! 

6 Jan, 2020 03:57 IST|Sakshi

శివరామకృష్ణన్‌ కమిటీలో అందరూ సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నిపుణులు 

జీఎన్‌ రావు కమిటీలోని వారంతా వివిధ రంగాల్లో నిష్ణాతులు 

అంతర్జాతీయస్థాయిలో అత్యున్నత కన్సల్టెన్సీ గ్రూపు బీసీజీ  

సాక్షి, అమరావతి: శివరామకృష్ణన్‌ కమిటీ..  కేంద్ర స్థాయిలో సీనియర్‌ అధికారులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
జీఎన్‌ రావు కమిటీ.. పలు రంగాలు, విభాగాల్లో విశేష అనుభవం ఉన్న నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ 
బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ).. ప్రపంచంలోనే టాప్‌–3 కన్సల్టెన్సీల్లో ఒకటి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నియమించిన రెండు కమిటీలు... ఓ అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీ.. ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి కోసం ఒకే మాటను నొక్కిచెప్పాయి. అదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ.. వికేంద్రీకరణే రాష్ట్రం ముందడుగు వేసేందుకు చోదకశక్తి అని విష్పష్టంగా ప్రకటించాయి. అప్పుడే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టాయి. రాష్ట్ర ప్రజల శాశ్వత ప్రయోజనాలకు ఏది సరైందని నిపుణులు భావించారో అదే తమ నివేదికల్లో స్పష్టం చేశారు. అందుకోసం పూర్తిస్థాయి కసరత్తు చేసి మరీ నివేదించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణలను పరిశీలించారు. ఆర్థిక పరిస్థితిని మదించారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని...సహజవనరులను పరిగణనలోకి తీసుకుని... అనుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషిస్తూ తమ నివేదికలను సమర్పించారు. 

ప్రతిపక్ష టీడీపీ మాత్రం రాజకీయ దురుద్దేశాలతో జీఎన్‌ రావు, శివరామకృష్ణన్‌ కమిటీల్ని, బీసీజీని విమర్శిస్తుండటం విస్మయపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను ఆనాటి సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ చైర్మన్, సభ్యులపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బీసీజీపై అవాస్తవ ఆరోపణలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీఎన్‌రావు, శివరామకృష్ణన్‌ కమిటీల్లో చైర్మన్లు, సభ్యుల సుదీర్ఘ పాలనానుభవం, వివిధ రంగాల్లో వారు చేసిన అవిరళ కృషి ఏమిటన్నది.. అదేవిధంగా బీసీజీ అంతర్జాతీయస్థాయిలో సాధించిన అత్యున్నత ప్రమాణాలు ఏమిటన్నది ఓసారి తెలుసుకుందాం... 

శివరామకృష్ణన్‌ కమిటీ.. 


1) కేసీ శివరామకృష్ణన్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి, వాణిజ్య, హోం శాఖల కార్యదర్శిగా చేశారు. దేశంలో స్థానిక సుపరిపాలనకు నాంది పలికిన 73, 74 రాజ్యాంగ సవరణల బిల్లుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా మెట్రోపాలిటన్‌ అథారిటీ సీఈవోగా వ్యవహరించారు. దుర్గాపూర్, అసన్‌సోల్‌ టౌన్‌షిప్‌ సృష్టికర్తగా ఖ్యాతి గడించారు.   
2) రతిన్‌ రాయ్‌: కేంబ్రిడ్జ్‌ నుంచి పీహెచ్‌డీ చేశారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఐక్యరాజ్యసమితి ఎన్‌ఐపీఎఫ్‌పీ డైరెక్టర్‌గా, బ్యాంకాక్‌లోని ఆసియన్‌ పసిఫిక్‌ రీజనల్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేంద్రం నియమించిన 13వ ఆర్థిక సంఘానికి సలహాదారు. 
3) అరోమర్‌ రెవి: ప్రజా వ్యవహారాలు, సమగ్రాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాల్లో 35 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు. యునిసెఫ్, యూఎన్‌డీపీ, యూఎన్‌ఈపీ తదితర విభాగాల్లో సేవలు అందించారు. ‘నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌’కు కో చైర్మన్‌గా వ్యవహరించారు. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ సెటిల్‌మెంట్స్‌’కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆ సంస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు. 
4) జగన్‌ షా: ఢిల్లీ యూనివర్సిటీ, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రణాళిక, పట్టణాభివృద్ధి రంగాల్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియాభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ), ప్రపంచ బ్యాంక్‌ ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు. టాటా ట్రస్ట్, మహారాష్ట్ర ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, భువనేశ్వర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో ఉన్నతస్థానాల్లో పనిచేశారు. 
5) కేటీ రవీంద్రన్‌: ఈయన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. 

జీఎన్‌ రావు కమిటీ.. 
1) జీఎన్‌ రావు: కమిటీ చైర్మన్‌గా ఉన్న జీఎన్‌రావు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాల్లో డీఆర్‌డీఏ పీడీ, జాయింట్‌ కలెక్టర్‌గా చేసిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. సైనిక సంక్షేమ డైరెక్టర్‌గా, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా, ఎన్నికల సంఘం కార్యదర్శి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రెవెన్యూ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా చేసిన ఆయనకు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ వ్యవహారాలపై పూర్తి పట్టుంది. గోదావరి ఫెర్టిలైజర్స్, కెమికల్స్‌ లిమిటెడ్‌(జీఎఫ్‌సీఎల్‌) ప్రత్యేక అధికారిగా 30 జాతీయ అవార్డులు, అంతర్జాతీయ అవార్డు పొందారు.  పర్యాటక, సాంస్కృతిక శాఖల ప్రత్యేక అధికారిగా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలకు గిన్నిస్‌ బుక్‌లో స్థానం దక్కింది.  
2) కేటీ రవీంద్రన్‌: పట్టణాభివృద్ధి రంగంలో నిపుణుడు. పర్యావరణ పరిరక్షణ, సామాజిక అంశాల మేలుకలయిగా నగరాల అభివృద్ధి కోణంలో ఆయన సుప్రసిద్ధుడు. ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌లో అర్బన్‌ డిజైన్స్‌ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఐదేళ్లు పని చేశారు. ఐక్యరాజ్యసమితికి చెందిన మాస్టర్‌ప్లాన్స్‌ సలహామండలిలో సభ్యుడిగా చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రాజెక్టులకు సలçహాదారుగా కూడా ఉన్నారు.  
3) ప్రొఫెసర్‌ మహావీర్‌: ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌లో ప్రొఫెసర్‌. రిమోట్‌ సెన్సింగ్‌ ఫిజికల్‌ ప్లానింగ్‌లో నిపుణుడు. పట్టణాభివృద్ధి రంగంలో 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్, ఆర్కిటెక్చర్‌లో ప్రొఫెసర్‌. అమృత్‌ నగరాల అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలక స్థానంలో ఉన్నారు.  
4) ఆర్‌. అంజలీమోహన్‌: అర్బన్, రీజనల్‌ ప్లానర్‌.. బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి అర్బన్‌ ఇ–గవర్నెన్స్‌ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేశారు. అర్బన్‌ ప్లానింగ్, మేనేజ్‌మెంట్‌లో 20 ఏళ్ల అనుభవం.  
5) కేబీ అరుణాచలం: పట్టణాభివృద్ధి రంగంలో 33 ఏళ్ల 
విశేష అనుభవం ఉంది.  పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో దేశంలో వివిధ ప్రాజెక్టుల్లో కీలకపాత్ర పోషించారు. వుడాలో చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌గా వ్యవహరించారు.  
6) ఏవీ సుబ్బారావు: జెన్‌టీయూలోని సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌లో ప్రొఫెసర్‌. ఉమ్మడి ఏపీలోనూ, తెలంగాణలోనూ రిమోట్‌ సెన్సింగ్‌  అప్లికేషన్‌ సెంటర్లలో చీఫ్‌ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఏపీలో చిత్తడి నేలల అట్లాస్‌ రూపొందించిన ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించారు. ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ)కు కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.  
7) సీహెచ్‌.విజయ్‌మోహన్‌: ఐఏఎస్‌ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా, సర్వే సెటిల్‌మెంట్స్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌గా వ్యవహరించారు. జీఎన్‌ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కార్యదర్శిగా వ్యవహరించారు.

అత్యుత్తమ కన్సల్టెన్సీ బీసీజీ... 

1963లో స్థాపించిన ఈ సంస్థకు 50 దేశాల్లో 90కి పైగా కార్యాలయాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో సమతుల– సమగ్రాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, కార్పొరేట్‌ వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధి, ఆహార భద్రత, వైద్య– ఆరోగ్య రక్షణ, విద్య తదితర రంగాల్లో బీసీజీ ప్రధాన భూమిక పోషిస్తోంది. సమతుల, సమగ్రాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి చేపట్టే ప్రాజెక్టుల్లో బీసీజీది కీలక పాత్ర. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, జీ–20 దేశాలకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ఉండే బి–20 సంస్థ, అమెరికాలో ప్రజా విధానాల రూపకల్పనలో సలహాదారుగా ఉన్న ‘బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌’ సంస్థ, బిల్‌–మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తదితర సంస్థలతో కలసి పనిచేస్తోంది. వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం, సేవ్‌ ద చిల్ట్రన్, టీచ్‌ టు ఆల్‌ వంటి అంతర్జాతీయస్థాయి కార్యక్రమాలను విజయవంతంగా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తోంది. బీసీజీ నిర్ధారించే గ్రోత్‌ రేటింగ్స్‌ను అంతర్జాతీయస్థాయిలో కార్పొరేట్, మేనేజ్‌మెంట్‌ సంస్థలు ప్రామాణికంగా తీసుకుంటాయి.   

>
మరిన్ని వార్తలు