ఆగస్టు నెలాఖరుకు తుది నివేదిక

1 Aug, 2014 07:11 IST|Sakshi

పది రోజుల్లో ముసాయిదా: శివరామకృష్ణన్


 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు అంశంపై తుది నివేదికను ఆగస్టు నెలాఖరుకు సమర్పించనున్నట్టు రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నామని, మరో పది రోజుల్లో ముసాయిదా పేరాలతో నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక సమర్పిస్తామని గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ఈ రోజు మంత్రి నారాయణ మాకు కావాల్సిన సమాచారం ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే ప్రాంతంలో ఉండాలని నిర్ణయించాం.

 

గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని రాబోతోందన్న వదంతులకు నేను బాధ్యుణ్ని కాను. నేను వదంతులు పుట్టించలేను, కేవలం వాస్తవాల ఆధారంగానే మాట్లాడగలను’’ అన్నారు. ఒక సామాజిక వర్గం రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య తేవాలని ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విమర్శలు ఎవరు చేసినా, అంతిమంగా, సాంకేతికంగా అన్ని అంశాలను చూపిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు