రాయపాటి... ఇదేం పరిపాటి?

1 Sep, 2014 13:32 IST|Sakshi
రాయపాటి... ఇదేం పరిపాటి?

తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఎదురుదాడి చేయడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలపై దానిపై సూచనలు, సలహాలు ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై చిందులేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడితో ఆగకుండా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసేస్తున్నారు.

ఎన్నికలకు ముందు 'హస్తం' గూటి నుంచి బయటకు వచ్చి పచ్చ కండువా కప్పుకున్న ఎంపీ రాయపాటి సాంబశిరావు- శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై తీవ్రారోపణలు చేశారు. కమిటీలోని కొంత మంది సీనియర్ సభ్యులు దొనకొండ, చుట్టుపక్కల ప్రాంతంలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని శివమెత్తారు.  కమిటీని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభావితం చేశారన్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక కమిటీ నివేదిక పట్ల సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కమిటీ దొనకొండలో పర్యటించినప్పటికీ... అక్కడకు కమిటీ సభ్యులు వెళ్లలేదని రాయపాటి చెప్పడం గమనార్హం.

కమిటీపై ఆరోపణలు చేసిన రాయపాటికి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ ఇచ్చారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి రెచ్చిపోతున్నారని అన్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడగుంటూరు-తెనాలిమంగళగిరి(వీజీటీఎం)లో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుకున్నారని చెప్పారు. కమిటీ నివేదికతో రాయపాటి సహా టీడీపీ కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. సమర్థులైన అధికారులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీపై రాయపాటి ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమకు నచ్చనివారిపై నిందలు వేయడం పచ్చ బాబులకు పరిపాటిగా అంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు