శివ..శివా!

4 Jan, 2015 01:40 IST|Sakshi
శివ..శివా!

గుంటూరు క్రైం/నరసరావుపేటరూరల్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడనే సామెతను నిజం చేయజూసిన దేవాలయ ఉద్యోగి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆలయంలో దొంగిలించిన విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి..

నరసరావుపేట మండలం కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు నలభై ఏళ్లుగా ఇత్తడి మండపవాహుకలు ఉన్నాయి. ప్రస్తుత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 2013లో వాటి స్థానంలో వెండి విగ్రహాలను సమర్పించారు. దీంతో గతంలో ఉన్న ఇత్తడి విగ్రహాలను ఆలయ అధికారులు స్టోర్‌రూమ్‌లో భద్రపరిచారు. ఈ ఆలయంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండే కొండకావూరుకు చెందిన దుర్గా కోటేశ్వరరావు స్టోరూంలో వున్న 60 కిలోల బరువుగల రెండు ఇత్తడి విగ్రహాలను దొంగిలించేందుకు పథకం వేశాడు. ఇందుకోసం మరో ఐదుగురు వ్యక్తులతో చేతులు కలిపి, విగ్రహాలను చోరీ చేశాడు.

వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు కోటప్పకొండకు చెందిన ముగ్గురు, పిడుగురాళ్ళ, గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు వారం క్రితం గుంటూరులోని పాత ఇత్తడి కొనుగోలుదారుల వద్దకు వెళ్లారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అర్బన్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిండంతో విగ్రహాల చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో విషయాన్ని నరసరావుపేట రూరల్ పోలీసులకు చేరవేసి దేవాలయ ఇన్‌చార్జ్ ఈవోకు కబురు చేశారు. చిత్రం ఏమిటంటే దొంగలు పోలీసుల చేతికి చిక్కే వరకూ కనీసం దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం ఆలయ అధికారులు గుర్తించలేదు.

నరసరావుపేట రూరల్ పోలీసులు సమాచారం అందించడంతో స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు గత నెల 28వ తేదీన ఆలయ ఈవో డి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు సైతం రహస్యంగా ఉంచారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు ఇత్తడి విగ్రహాలనూ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులు అర్బన్ సీసీఎస్ పోలీసుల అదుపులో ఉండటంతో నిందితులను నేడో, రేపో అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు