గజరాజుల బెడద మళ్లీమొదలైంది

14 Aug, 2019 09:28 IST|Sakshi

జిల్లాలోకి చొచ్చుకొచ్చిన  ఆరు ఏనుగుల గుంపు

ఉలిక్కిపడిన వంగర మండల ప్రజలు 

గత సంఘటనలతో భయపడిపోతున్న స్థానికులు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోకి మంగళవారం ఆరు ఏనుగుల గుంపు ప్రవేశించింది. కొంతకాలంగా విజయనగరం జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు ఒక్కసారిగా వంగర మండలంలోకి ప్రవేశించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏనుగుల ఘీంకార శబ్దాలకు భయపడి ప్రజలు పరుగులు పెట్టారు. ఇప్పటికే వీరఘట్టం తదితర మండలాల్లోని గిరిజనులు ఏనుగుల వల్ల పంటలు నష్టపోయారు. ఇప్పుడు వంగర మండల వాసులు ఏం చేస్తాయోనని భయపడుతున్నారు.

ఆ గుంపే మళ్లీ వచ్చింది.. 
2007 నుంచి నాలుగు ఏనుగుల గుంపు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. వీటితో సతమతమవుతున్న తరుణంలో 2017 మే 17న మరో 8 ఏనుగుల గుంపు ఒడిశా రాష్ట్రం రాయగఢ జిల్లా నుంచి మన జిల్లా కళింగదళ ప్రదేశంలోకి చొరబడింది. అప్పట్లో పెద్ద ఎత్తున హల్‌చల్‌ చేlశాయి. ఆ తర్వాత  దూసి రైల్వే లైను దాటు తూ కనుగులవానిపేట వద్ద, ఎల్‌.ఎన్‌.పేట మండలం కడగండి వెస్ట్‌ బీట్‌ వద్ద సంచరించాయి. ఈ క్రమంలో మెళియాపుట్టి మండలం హిరాపురం వద్ద ఇద్దరు గిరిజనులను హతమార్చాయి. దీంతో ఏనుగులు తరలించేందుకు రూ.2 కోట్లు నిధులతో ఆపరేషన్‌ గజేంద్రను జిల్లా అటవీ శాఖాధికారులు చేపట్టారు. వాటిని ఒడిశా తరలించారు. అందులో రెండు చనిపోగా, మిగతా ఆరు మళ్లీ వెనక్కి వచ్చేశాయి. మొన్నటి వరకు విజయనగరం జిల్లాలో సంచరించగా, ఇప్పుడవి మళ్లీ మన జిల్లాలోని వంగర మండలం వీవీఆర్‌పేట పంచాయతీ జేకే గుమ్మడ గ్రామ సమీపంలోని మెట్ట భూముల్లోకి చొచ్చుకొచ్చాయి.

గతంలో ఏం జరిగిందంటే..?
2007 మార్చిలో ఒడిశా లఖేరీ అడవుల నుంచి 9 ఏనుగుల గుంపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులో ప్రవేశించింది. 2007 అక్టోబర్‌లో ఏనుగుల గుంపును తరలించేందుకు అప్పటి అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ఆపరేషన్‌ గజ చేపట్టారు. చిత్తూరు, బెంగళూరుకు సంబంధించిన తర్ఫీదు పొందిన మావటీలతోపాటు జయంతి, గణేష్‌ అనే శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. ఆశించినంతగా ఫలితం ఇవ్వకపోయినప్పటికీ రెండు ఏనుగులను అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనాలతో ఒడిశా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక ఏనుగు మార్గమధ్యంలోనే మృతి చెందింది. మరో ఏనుగు కూడా తరలించిన అనంతరం మృతి చెందింది. ఇలా వరుసగా ఏనుగుల మృతి చెందిన నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఆపరేషన్‌ గజ నిలిచింది. వీటిలో ఏడు ఏనుగులు సంచరించగా వీరఘట్టం మండలం కుంబిడి ఇచ్ఛాపురం వద్ద కొంతమంది రెండు ఏనుగులను హతమర్చారు. అనంతరం ఎస్‌.గోపాలపురం వద్ద విద్యుత్‌ షాక్‌ తగిలి మరో ఏనుగు మతి చెందింది. ప్రస్తుతం వాటిలో నాలుగు ఏనుగులు మాత్రమే జిల్లా అడవుల్లో సంచరిస్తున్నాయి. వాటికి తోడు తాజాగా చొచ్చుకొచ్చిన ఆరు ఏనుగులతో ఆ సంఖ్య పదికి చేరింది.

భయపెడుతున్న గత సంఘటనలు.. 
గత 12 ఏళ్ల నుంచి నేటి వరకు ఏనుగుల బారిన పడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 మంది దుర్మణం చెందారు. ఇప్పుడు మళ్లీ ఆరు ఏనుగుల గుంపు రావడంతో గిరిజన గ్రామాల ప్రజలతో పాటు ప్రస్తుతం సంచరిస్తున్న ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.     

సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు..

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో కడగండి పంచాయతీ పరిధిలోని సూదిరాయిగూడ సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. మంగళవారం వేకువజామున ఆ ప్రాంతానికి ఏనుగులు వచ్చి ఘీంకారాలు చేయడంతో ఆ ప్రాంత గిరిజనులు ఆందోళన చెందారు. ఫైనాపిల్, అరటి తదితర పంటలను నాశనం చేస్తున్నాయని గిరిజనులు తెలిపారు. కొండపోడు పనులకు సైతం వెళ్లలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు