పిడుగుల వాన

25 Apr, 2018 09:00 IST|Sakshi
పిడుగు పాటుకు మృతిచెందిన రామయ్యమ్మ, శ్రావణి మృతదేహాలు

రెండు జిల్లాల్లో ఆరుగురు మృతి

పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం

సాక్షి, చిత్తూరు/శ్రీకాకుళం పాతబస్టాండ్‌/భోగాపురం/తెర్లాం/పూసపాటిరేగ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వడగండ్లు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు గురై విజయనగరం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై 46 మేకలు మరణించాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం రాజాపులోవ గ్రామానికి చెందిన దుక్క రామయ్యమ్మ (45), మురపాల శ్రావణి (9) చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు. శ్రావణికి పంటి నొప్పి ఎక్కువగా ఉండడంతో అమ్మమ్మ అయిన రామయ్యమ్మ తగరపువలసలో ఉన్న ఆస్పత్రికి బయలుదేరింది. చెరువుగట్టుపై నడిచి వెళ్తుండగా వారికి సమీపంలో పిడుగు పడడంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. తెర్లాం మండలంలోని సుందరాడ గ్రామానికి చెందిన దాకారపు ఆదినారాయణ (35) గ్రామానికి సమీపంలో మొక్కజొన్న గింజలు ఎండబెట్టాడు. మంగళవారం ఉదయం 11గంటల సమయంలో వర్షం రావడంతో గింజలు ఎత్తేందుకు వెళ్లాడు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.రెల్లివలస గ్రామానికి చెందిన రౌతు గౌరినాయుడు (22) సమీపంలోని చంపావతినదిలో గేదెలు కడుగుతుండగా పిడుగుపడి అక్కడకక్కడే మృతి చెందాడు. 

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం పనసనందివాడలో వంట మనిషి దుర్గారావు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. రేగిడి మండలంలో ఉపాధి పనులకు వెళ్లి వస్తున్న కండ్యాం గ్రామానికి చెందిన టి.జయమ్మపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలమనేరు, రొంపిచెర్ల, బి.కొత్తకోట వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. పెద్దపంజాణి మండలం పెద్దకాప్పల్లి పంచాయతీ తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు 46 మేకలు చనిపోయాయి. 

మరిన్ని వార్తలు