జనజీవన స్రవంతిలో కలవండి

7 May, 2019 11:54 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎïస్పీ బాబూజీ, చిత్రంలో లొంగిపోయిన దళ సభ్యులు

మావోయిస్టులకు జిల్లా ఎస్పీ బాబూజీ పిలుపు

ఆరుగురు దళ సభ్యులు లొంగిపోయినట్టు వెల్లడి

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం

పెదవాల్తేరు (విశాఖతూర్పు): విశాఖ ఏజెన్సీలో గల మావోయిస్టులంతా స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ పిలుపునిచ్చారు. పెదవాల్తేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెదబయలు సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ దళ సభ్యులు ఇద్దరు, హార్ట్‌కోర్‌మిలీషియా సభ్యులు నలుగురు తమకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరు ఏఏ కేసులతో సంబంధం ఉందో వివరించారు. ఒడిశాలోని చిత్రకొండ జిల్లాకు చెందిన గొల్లూరి బిరుసు (24), పెదబయలు మండలానికి చెందిన గొల్లూరి రామయ్య (25), జి.మాడుగుల మండలానికి చెందిన కొర్రాసత్తిబాబు (37), పెదబయలు మండలానికి చెందిన గొల్లూరి సత్యనారాయణ (18), కొర్రా గణపతి (40), కొర్రా పాత్రో (19) లొంగిపోయినవారిలో ఉన్నారన్నారు. బిరుసుకు 2016లో ముంచంగిపుట్టు మండలంలో శివయ్య అనే వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో పాల్గొన్నట్టు వివరించారు.

అదే ఏడాదిలో ముంచంగిపుట్టులో, 2018లో ఒడిశాలో, తరువాత జీకేవీధి మండలంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనల్లో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. అలాగే 2018లో ఒడిశాలో రోడ్డు యంత్రాల దగ్ధం ఘటనలో కూడా పాల్గొన్నాడన్నారు. మరో సభ్యుడు రామయ్య 2015లో ముంచంగిపుట్టుప్రాంతానికి చెందిన రామయ్యను హత్య చేసిన ఘటనలో పాల్గొన్నట్టు ఎస్పీ చెప్పారు. 2017లో జి.మాడుగులలో సూర్య, కిశోర్‌ల హత్య చేసిన సంఘటనలో, 2019లో దోసిలబంద వద్ద మందుపాతర అమర్చిన సంఘటనలో పాత్ర ఉందన్నారు.  జుమఢాంగి గ్రామంలో మూడు ఇళ్లపై జరిగిన కరువు దాడుల్లో కూడా పాల్గొన్నాడన్నారు. సత్తిబాబుకు 2015లో జి.మాడుగులలో జరిగిన సత్యారావు హత్యకేసుతో సంబంధం ఉందన్నారు. మరో సభ్యుడు గణపతికి పెదబయలులో కిల్లో మోహన్, 2015లో ముంచంగిపుట్టులో రామయ్య హత్య కేసులతో సంబంధం ఉందన్నారు. పాత్రోకు 2015లో జి.మాడుగులలో వంతల సత్యారావు హత్య కేసుతో, 2015లో ముంచంగిపుట్టు రామయ్య హత్య కేసులతో సంబంధం ఉందని పేర్కొన్నారు. లొంగిపోయిన సభ్యులపై మందుపాతర్ల ఏర్పాటు, కరువు దాడులు చేసిన సంఘటనలకు సంబంధించి వారిపై కేసులు ఉన్నాయన్నారు.

‘మానసికహింస భరించలేకే లొంగుబాటు’
లొంగిపోయిన దళ సభ్యుల విషయమై ఎస్పీ ప్రస్తావిస్తూ.. దళం  సీనియర్‌ సభ్యులు వీరిని ప్రతి విషయానికి అనుమానించడం, దళంలో వీరి మాటలకు విలువ లేకపోవడం, మానసిక హింస భరించలేక  లొంగిపోయినట్టు చెప్పారని పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామన్నారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) బొడ్డేపల్లి కృష్ణారావు, సీఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ సుదీప్‌ వాక్‌చరే పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు