మరో ఆరు మృతదేహాలు లభ్యం

19 Sep, 2019 04:24 IST|Sakshi
రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి నాలుగో రోజు వచ్చిన మృతదేహాలు

సహాయక చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా 

ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దని ఆదేశాలు 

ఇప్పటివరకూ లభించిన మృతదేహాలు 34 

నేటికీ కానరాని 18 మంది ఆచూకీ 

దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం:  ప్రైవేట్‌ టూరిజం బోటు ప్రమాద ఘటనలో నాలుగో రోజు బుధవారం మరో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5, పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద ఒక మృతదేహం లభించాయి. గాలింపు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నాలుగో రోజు కూడా జిల్లా మంత్రులు, అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.  

పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధం 
బోటులో ప్రయాణించిన పర్యాటకుల సంఖ్యపై సందిగ్ధత నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం బోటులో 73 మంది ప్రయాణించగా.. తొలిరోజు 8, మూడో రోజు 20, నాలుగో రోజు బుధవారం 6 కలిపి ఇప్పటివరకూ 34 మృతదేహాలు లభ్యమయ్యాయి. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీని బట్టి చూస్తే మరో 13 మంది ఆచూకీ లభించాల్సి ఉంది. ఆచూకీ లభించని వారి వివరాలుంటే తెలియజేయాలని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి ఆవరణలో రెవెన్యూ అధికారులు మైక్‌ ప్రచారం చేశారు. గల్లంతైన వారి బంధువులు ఇచ్చిన మరో 5 పేర్లను కలుపుకుని మరో 18 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ప్రకారం చూస్తే బోటులో ప్రయాణించిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుందంటున్నారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఎంపీ భరత్, ఏలూరు రేంజ్‌ డీఐజీ ఖాన్, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

బోటు వెలికితీతకు అధిక ప్రాధాన్యం 
బోటును వెలికి తీసి.. అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసుకొచ్చి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నదులు, సముద్రాల్లో మునిగిపోయిన బోట్లను వెలికి తీయడంలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వం రప్పించింది. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇండియన్‌ నేవీ, ఫైర్‌  సిబ్బంది మృతదేహాలను గాలిస్తున్నారు. ముంబైకి చెందిన మెరైన్‌ మాస్టర్స్‌ అనే మల్టీనేషనల్‌ కంపెనీ నుంచి ఒక బృందం వచ్చింది. కాకినాడ పోర్టు డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో మునిగిన బోటును వెలికితీసేందుకు కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం ఆధ్వర్యంలో మరో బృందం రంగంలోకి దిగింది. 2 వేల అడుగుల పొడవైన బలమైన నైలాన్‌ తాడు, ఐరన్‌ రోప్, కప్పీలు ఇతర సామగ్రితో బోటును వెలికితీసే పనులు సాగుతున్నాయి. 

వడి నొక్కేస్తోంది.. సుడి తిప్పేస్తోంది 
‘గోదావరిలో వడి ఎక్కువగా ఉంది. ప్రమాద ప్రదేశంలో సుడిగుండాలు తిప్పేస్తున్నాయి. నీటి అడుగున ఉన్న లాంచీ సమీపంలోకి వెళ్లడమే కష్టంగా ఉంది. దీనిని బయటకు తీయడం సవాల్‌గా మారింది’ అని కాకినాడ జగన్నాధపురానికి చెందిన ధర్మాడ సత్యం చెప్పారు. కచ్చులూరు వద్ద మునిగిన బోటును సంప్రదాయ పద్ధతిలో వెలికితీసేందుకు సత్యం బృందం రంగంలోకి దిగింది. గతంలో నాగార్జున సాగర్, బలిమెలలో మునిగిన లాంచీలను ఆ సంస్థ వెలికి తీసింది. దాంతో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే పనిని సత్యంకు అప్పగించారు. కచ్చులూరు వద్ద బోటును వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమైన సత్యం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అక్కడి సుడిగుండాలు మా బోట్ల కూడా తిప్పేస్తున్నాయి. చాలా రిస్క్‌ చేయాల్సి వస్తోంది. బుధవారం సాయంత్రం వరకు పనిచేశాం. గురువారం ఉదయం మళ్లీ పనులు ప్రారంభిస్తాం. ఎగువ నుంచి వరద తగ్గుముఖం పడితేగానీ బోటును తీయడం సాధ్యం కాదు’ అని వివరించారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
గోదావరి పడవ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.3 లక్షలు, స్వల్ప గాయాలకు గురైన వారికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా