వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు జలసమాధి

19 Sep, 2019 10:03 IST|Sakshi

అందరూ ఒకే కుటుంబీకులు

గల్లంతైన వారిలో ముగ్గురు చిన్నారులు

శుభ కార్యక్రమానికి వెళ్లొస్తుండగా దుర్ఘటన

ఫలించని గాలింపు యత్నాలు

పోట్లదుర్తిలో విషాదఛాయలు

అనుకోని విషాదం ఇంటిల్లిపాదినీ పొట్టనబెట్టుకుంది. వరద రూపంలో కాటేసింది. నిశిరాత్రి..చుట్టూ నీళ్లు.. ముందుకు సాగని ఆటో.. చూస్తుండగానే పెరిగిపోయిన ప్రవాహం..ఏం జరుగుతుందో తెలిసేలోగానే జలం చుట్టుముట్టేసింది. రెక్కాడితే డొక్కాడని ఓపేద కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఆటో నడుపుతున్న వ్యక్తితోపాటు అతని తల్లి..భార్య..ముగ్గురు పిల్లలు వరదనీటిలో గల్లంతైన సంఘటన పోట్లదుర్తి దళిత వాడను కుదిపేసింది. కుందూనది వరద ఉధృతికి కామనూరు వంక వద్ద ఆరుగురు జలసమాధి అయిన సమాచారం విషాద సంద్రంలో ముంచింది.

సాక్షి, కడప: సంతోషంగా సాగిపోతున్న వారి జీవన నావ వరదలో చిక్కుకుంది. కుటుంబమంతా జలసమాధి అయింది. అనూహ్యంగా పెరిగిన వరద ఉధృతి ఆరుగురిని కబళించింది. అందులో ముగ్గురు చిన్నారులు..అనుకోని సంఘటనతో గల్లంతైన ఆ కుటుంబం గురించి ఊరంతా కన్నీరు పెడుతున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి దళితవాడకు చెందిన మల్లుగాళ్ల రామాంజనేయులు(30) చాలా కాలంగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పెంచలమ్మ(25), పిల్లలు అంజలి(6) కార్తీక్‌(10 నెలలు) మేఘన(4)లతోపాటు అతని తల్లి సుబ్బమ్మ(60) కూడా వారితోనే ఉండేది. చిన్న మిద్దె ఇంటిలో వీరు నివాసం ఉంటున్నారు.

అంజలి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతుండగా, మేఘనను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రానికి పంపేవారు. ఆర్థ్ధిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవ్వడంతో ఫైనాన్స్‌ వ్యాపారి వద్ద వడ్డీకి రుణం తీసుకుని రెండు వారాల క్రితం ఆటో కొనుక్కున్నాడు. కొత్త ఆటో వచ్చిందని  నలుగురికీ చెప్పి సంతోషపడేవాడు. ఈ నేపథ్యంలో  దువ్వురు మండలం గొల్లపల్లెలోని  మేనత్త ఇంట సోమవారం సీమంతం జరిగింది.   శుభకార్యక్రమానికి సొంత ఆటోలో కుటుంబసభ్యులను తీసుకు వచ్చాడు. చీకటి పడినా అక్కడే కుటుంబ సభ్యులతో   సరదాగా గడిపారు. ఈ రాత్రి ఇంటిలోనే ఉండిపోవాల్సిందిగా  మేనత్త కుటుంబీకులు కోరారు. కానీ పొద్దున్నే మళ్లీ ఆటో తీసుకుపోకపోతే గాని నాలుగు డబ్బులు రావని భావించిన రామాంజనేయులు ఇంటికి వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నాడు.

రాత్రి 11గంటలు దాటిన తర్వాత తన కుటుంబ సభ్యులను ఆటో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికే కొంత వర్షం పడుతోంది. ఒకపక్క చిమ్మచీకటి..మరోపక్క వర్షం జోరు. ఇంటికి తొందరగా వెళ్లిపోదామనే ధీమాతో రామాంజనేయులు ఆటో పోనిచ్చాడు. సమీపంలోని గ్రామస్తులు ఆటోలో వెళ్తున్న వీరిని ముందుకు పోవద్దని వారించినట్లు తెలిసింది.  ప్రొద్దుటూరు సమీపంలోని కామనూరు వంక వద్ద రాగానే  వరద నీటిలో ఆటో చిక్కుకొని బోల్తా పడింది. సుబ్బమ్మ, చిన్నారితో పాటు పసికందు నీళ్లలో పడిపోయి కనిపించకుండా పోయారు. కుమార్తెను ఎత్తుకొని రామాంజనేయులు, అతని భార్య పెంచలమ్మ వరద నీటిలో ఎటూ కదల్లేకపోయారు. ఆటో బోల్తా పడిన విషయం తెలియడంతో స్థానికులు వేగంగా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులుకూడా వచ్చారు.

చీకటిలో ఏమీ కనిపించడం లేదు.  వంక దిగువ నుంచి కాపాడండి.. అనే శబ్దంతో పాటు చిన్నారి ఏడుపు వినిపించిందని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు లైట్లు వేసి చూడగా దూరంగా చిన్నారిని ఎత్తుకొని ఒక వ్యక్తి కనిపించారు. మోటారు పైపును పట్టుకొని మరో మహిళ నీళ్లలో చిక్కుకుంది. కుమార్తెనైనా బతికించుకోవాలనే తాపత్రయంతో అతను నీటి ఉధృతిలోనే సుమారు రెండున్నర గంటల పాటు ఎదురొడ్డి పోరాడాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.  క్రమంగా వరద ఉధృతి పెరిగిపోయింది.  చిన్నారితో పాటు భార్యాభర్తలు కనిపించలేదు. వారిని కాపాడేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత ఆటో గల్లంతు అయిన సంఘటన బయటపడినా అందులో ఉన్నవారెవరో తెలియలేదు. ముగ్గురు గల్లంతయ్యారని భావించారు.

రామాంజనేయులు అత్తగారి ఊరు మైదుకూరు మండలం ఉత్సలవరం. సోమవారం రాత్రికి వారి ఆటో పోట్లదుర్తికి రాకపోవడంతో ఉత్సలవరానికి వెళ్లింటారని ఊళ్లో బంధువులు భావించారు. బుధవారం బంధువులు అనుమానంతో గొల్లపల్లెలోని తెలిసినవారికి ఫోన్‌ చేశారు.  సోమవారం రాత్రే ఆటోలో వెళ్లిపోయారని చెప్పారు. రామాంజనేయులు అన్న రామకృష్ణతో పాటు బంధువులు రూరల్‌ పోలీసులను సంప్రదించడంతో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసింది. రామాంజనేయులుకు నలుగురు సంతానం . మొదటి కుమారుడు ప్రమాదశాత్తూ ఆరేళ్ల క్రితం గోడకూలి మృతి చెందాడు.  కూలి పని చేసుకుని జీవించే కుటుంబం జలసమాధి కావడం అందరినీ కలచివేసింది.  పోట్లదుర్తిలోని దళితవాడలో వారి ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరి కన్నీమున్నీరుగా విలపించారు.

రబ్బరు బోట్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలతో గాలింపు
కామనూరు వంకలో గల్లంతైన వారి కోసం రెండో రోజు గాలింపు చర్యలు చేపట్టారు. రబ్బరు బోట్లతో అగ్నిమాపక రెస్క్యూ టీం ఒక వైపు, కర్నూలు నుంచి వచ్చిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు మరో వైపు గాలిస్తున్నారు. మంగళవారం చీకటి పడే వరకు   వెతికినా వారి ఆచూకి తెలియలేదు. డీఎస్పీ సుధాకర్‌ ఆధ్వర్యంలో సీఐ విశ్వనాథ్‌రెడ్డి, ఎస్‌ఐలు, అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్‌ గాలిస్తున్నారు. కుందూ తీరప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.   

వద్దురా అంటున్నా వినలేదు...
రాత్రి అయింది ..పొద్దున్నే పోదులేరా అని చెప్పినా.. ఏముందిలే అక్క ..బస్సులో కాదు కాద.. మన ఆటోలో పోతాంలే అంటూ బయలు దేరాడు. వరద నీటిలో గల్లంత అయినారు అని విషయం తెలిసింది. మేం ఒక ఆటోలో సీమంతానికి వెళ్లాం..రాతిర నీళ్లొచ్చాయి.. అని కూడా చెప్పాం. వినకుండా వెళ్లారు. భగవంతుడు ఇలా విషాదాన్ని మిగులుస్తాడని అనుకోలేదు. 
 – సుభాషిణి .. రామంజనేయులు సోదరి,  పోట్లదుర్తి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా