వైఎస్‌ షర్మిల ఫిర్యాదు.. ఆరుగురికి నోటీసులు

23 Jan, 2019 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. ఆరుగురు నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపారు. యూట్యూబ్ ఇచ్చిన ఐపీ అడ్రస్ సమాచారంతో నోటీసులు పంపారు. ఇంకా 16 యూఆర్ఎల్ లింకులకు సంబంధించి గూగుల్ నుండి ఐపీ అడ్రస్ రావాల్సి ఉంది. ఐపీలు అందగానే మరికొందరికి నోటీసు ఇచ్చే యోచనలో సైబర్ క్రైం పోలీసులు ఉన్నారు. 

ఇప్పటికి నోటీసులు అందుకున్న వారిలో హైపర్ ఎంటర్‌టైన్‌మెంట్‌, తెలుగు ఫుల్ స్ర్కీన్, ఛాలెంజ్ మంత్రా, సిల్వర్ స్క్రీన్, టాలీవుడ్ నగర్, తెలుగు మెస్సెంజర్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మరిన్ని ఆధారాలకోసం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులపై ఐటీ యాక్ట్ తో పాటు 509 ఐపీసీ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నవారితోపాటు చేయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుని మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ షర్మిల తన భర్త అనిల్‌ కుమార్‌తో కలసి గతవారం హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు