వారు సిమి కార్యకర్తలు కాదు, దొంగల ముఠా!

7 Apr, 2015 03:15 IST|Sakshi

కర్నూలు: నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు అనుమానితులు మధ్యప్రదేశ్కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు. తొలుత వారు సిమీ కార్యకర్తలని ప్రచారం జరిగింది. అయితే, పట్టుబడింది మధ్యప్రదేశ్‌కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు తేల్చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.

నల్లగొండ జిల్లాలో ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సిమీ ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరుగురు దొంగలను సిమి కార్యకర్తలన్న అనుమానంతో తిరుపతి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు పరారయ్యారు. దీంతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. వారి కళ్లు కూడా కప్పేయడంతో సమాచారం నంద్యాల పోలీసులకు చేరింది. దాంతో నంద్యాల పోలీసులు అన్ని వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు.

దీంతో ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు