అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

8 May, 2018 11:35 IST|Sakshi

హత్యేనని అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు

చిలకలూరిపేట: ఆరేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మరోవైపు బాలుడి బంధువులు ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం గణపవరానికి చెందిన కొండెబోయిన చెన్నయ్యకు సుమారు పదేళ్ల కిందట ముప్పాళ్ల మండలం పాలపాడుకు చెందిన బుచ్చెమ్మతో వివాహం జరిగింది. ఇద్దరు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 వీరికి ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు కొండెబోయిన అయ్యప్ప (6) ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటినుంచి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులతో కలిసి కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా ఇంటికి అరకిలోమీటరు దూరంలో తుప్పల్లో విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. 

అక్రమ సంబంధమే కారణమా...!
వివాహానికి ముందు నుంచి ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన లక్ష్మణ అనే వ్యక్తితో బుచ్చెమ్మకు పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా భర్త, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని లక్ష్మణ ఫోన్ల ద్వారా బుచ్చెమ్మను వేధిస్తున్నట్లు బంధువులు తెలిపారు. తనతో రానిపక్షంలో పిల్లలను హతమారుస్తానని పలుమార్లు బెదిరించగా బుచ్చెమ్మ నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాలుడు అనుమానస్పదస్థితిలో మృతి చెందడం, నోటినుంచి నురగ కారి ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది. 

ఈ విషయమై రూరల్‌సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ మృతి చెందిన బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. నోటినుంచి నురగ కారి ఉన్నందున ఏదైన పాముకాటు లేదా విషప్రయోగం అనేది పోస్టుమార్టం అనంతరం తెలిసే అవకాశం ఉందన్నారు. మృతిచెందిన బాలుడి తల్లి బుచ్చెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు