పేదింటి బిడ్డకు పెద్ద కష్టం

13 Jun, 2019 10:25 IST|Sakshi
డయాలసిస్‌ చేయించుకుంటున్న బాలుడు ధనోజ్‌

సాక్షి, విశాఖపట్నం : విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుం టుందో ఎవరికీ తెలీదు. విధి మూలంగా కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు మంచానికే పరిమితమవుతున్నారు. ఇప్పుడు చదువుతున్న ధనోజ్‌(ఆరేళ్లు) కన్నీటి గాధ అటువంటిదే. నిత్యం ఆటపాటలతో తోటివారితో సరదాగా గడపాల్సిన లేత వయసులో రెండు కిడ్నీలు పాడవడంతో మంచానికే పరిమితమయ్యాడు. తనకేం కష్టం వచ్చిందో కూడా తెలి యని వయసు. తన బాధను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి తనకేదో అయిపోందనుకే చిన్నారి ఆవేదన వర్ణనాతీతం.

పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డుపడుతోంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న దనోజ్‌ తండ్రి రెండు నెలల కిందట తన ఇద్దరు పిల్లల వైద్యం కోసం సుమారు రూ.2 లక్షలు, ధనోజ్‌ కోసం గత నాలుగు రోజుల్లో మరో రూ.2 లక్షలు ఖర్చుచేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆపన్నులు సాయం కోసం ఎదురుచూస్తోంది.అనకాపల్లి రేబాక గ్రామానికి చెందిన ముమ్మన సత్యనారాయణ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు.

భార్య లలిత గృహిణి. వీరికి  ప్రదీప్, ధనోజ్, నితిన్‌ సంతానం. ధనోజ్, నితిన్‌కు రెండు నెలల క్రితం డెంగ్యూ వ్యాధి సోకడంతో రూ.2 లక్షల వరకూ ఖర్చయ్యింది. జ్వరం తగ్గిందనుకున్న పది రోజల్లోనే ధనోజ్‌కు మొహం పొంగింది. వెంటనే సమీపంలో ఉన్న లండన్‌ చిల్డ్రన్స్‌ హాస్పటల్లో చేర్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అకస్మాత్తుగా ఓ రోజు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయాడు. తర్వాత రోజు నిద్రలో మూర్చపోయినట్టు నాలుక కరుచుకోవడం చూసి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన లండన్‌ చిల్డ్రన్స్‌ హాస్పటల్‌ వైద్యులు విశాఖలోని ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.

అక్కడి వైద్యులు  పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పాడైనట్లు చెప్పారు. ప్రస్తుతం బాలునికి డయాలసిస్‌ చేస్తున్నారు.ఆర్థికంగా చితికిపోయామని, సాయం చేసి తన బిడ్డను కాపాడాలని సత్యనారాయణ వేడుకుంటున్నాడు. సాయం చేసే దాతలు 9949718928 నంబరుకు ఫోన్‌ చేయాలని అభ్యర్థించాడు. ఖాతాదారుని పేరు ముమ్మన లలిత, భారతీయ స్టేట్‌బ్యాంక్, అకౌంట్‌ నంబరు 38316378836, గవరపాలెం బ్రాంచ్, అనకాపల్లి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0011112లో డబ్బులు వేసి సాయం చేయవచ్చు. 

మరిన్ని వార్తలు