ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు ‘చార్జీల పుస్తకం’

13 Dec, 2013 01:15 IST|Sakshi

తాండూరు, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పొందుతున్న రైతుల నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు త్వరలో ‘విద్యుత్ చార్జీల పుస్తకం’(స్లాబ్ పాస్‌బుక్) అందజేయనున్నట్టు వికారాబాద్ డివిజన్ విద్యుత్ డీఈ సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం తాండూరు విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్న రైతులను గుర్తించడంతో పాటు, సర్వీసు చార్జీల బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు స్లాబ్ పాస్‌బుక్‌లు అందించనున్నట్టు వివరించారు.
 
 2004 సంవత్సరానికి ముందు ఈ తరహా పుస్తకాలు ఉండేవన్నారు. ఈ పుస్తకాలతో బకాయిల వసూలుతో పాటు అక్రమ సర్వీసుసు గుర్తించి క్రమబద్ధీకరణకు ఆస్కారం ఉంటుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో 45వేల ఉచిత విద్యుత్ సర్వీసులు ఉన్నాయని, ఇందులో సుమారు 6-7 వేల వరకు అక్రమ సర్వీసులున్నాయని ఆయన తెలిపారు. 2004వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉచిత విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.9కోట్ల సర్వీసు చార్జీలు, అలాగే ఉచిత విద్యుత్ వర్తించని వ్యవసాయదారుల నుంచి మరో రూ.3కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. స్లాబ్ పాస్‌బుక్ పొందిన రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఒక సర్వీసు నంబర్‌ను కేటాయిస్తామన్నారు. ఈ సర్వీసు నంబర్ లేని రైతులు అక్రమ సర్వీసులు కలిగి ఉన్నట్టు పరిగణిస్తామన్నారు. అయితే బకాయి ఉన్న సర్వీసు చార్జీలు మొత్తం చెల్లించిన రైతులకే ఈ పుస్తకం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బకాయిలు చెల్లించిన రైతులకు పుస్తకాలు ఉచితంగా అందిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పుస్తకాలు లేని రైతుల సర్వీసులను తొలగిస్తామన్నారు. ఇటీవలనే బండెనకచర్లలో రైతులకు ఈ పుస్తకాలు అందించామని చెప్పారు. శుక్రవారం బంట్వారం మండలం తోర్మామిడి, శనివారం నుంచి తాండూరు సబ్‌డివిజన్ పరిధిలోని చెంగోల్, బెల్కటూర్, మైల్వార్, ఎల్మకన్నె, రాస్నం తదితర గ్రామాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.
 
 బకాయిలు కచ్చితంగా చెల్లించాల్సిందే..
 గతంలో విద్యుత్ వినియోగించుకొని, బోర్లు ఎండిపోయిన రైతులు రూ.5,400 చెల్లిస్తే మళ్లీ కనెక్షన్ రెగ్యులర్ చేస్తామని డీఈ తెలిపారు. నెలకు రూ.30 చొప్పున 9ఏళ్లుగా బకాయిపడ్డ సర్వీసు చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని, లేకపోతే స్టార్టర్లు తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు.
 ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోటా 5వేలు ఉండగా, ఇప్పటివరకు సుమారు 2500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వివరించారు.
 
 వికారాబాద్ డివిజన్‌లో 61 విద్యుత్ సబ్‌స్టేషన్‌ల పరిధిలో పెద్ద పరిశ్రమలను మినహాయించి 2.40లక్షల ఎల్‌టీ సర్వీసులు ఉన్నాయని, వీటిపై నెలకు సుమారు 90 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందన్నారు. ఇందులో వ్యవసాయరంగానికే నెలకు సుమారు 30లక్షల యూనిట్ల డిమాండ్ ఉందని వివరించారు. జిల్లా సౌత్ సర్కిల్‌లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలు చెల్లించడం లేదన్నారు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నందున వాటి వసూలుకు స్లాబ్ పాస్‌బుక్కులను అందిస్తున్నట్టు చెప్పారు. చార్జీలు చెల్లించిన తేదీ, రసీదు నంబరు తదితర వివరాలన్నీ పుస్తకంలో ఉంటాయని, రైతు ఫోటో జత చేస్తే మండల ఏఈ సంతకం చేస్తారని వివరించారు. అంతకుముందు విద్యుత్ సిబ్బందితో సమావేశమైన డీఈ, విద్యుత్ బకాయిల వసూలు వేగవంతం చేసి లక్షా ్యలను సాధించాలని ఆదేశించారు. సమావేశంలో మండల ఏఈ తుల్జారామ్‌సింగ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు