ఆధునికీకరణ అంతంతే..

3 Jun, 2014 02:34 IST|Sakshi

 దర్శి, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. సాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.4,400 కోట్లతో చేపట్టారు. ఈ పనులు ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తికావాల్సి ఉంది. కాంట్రాక్టర్ల ఒప్పందం ప్రకారం ఈ పనులు మూడేళ్లలో పూర్తిచేసేలా టెండర్లు వేశారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోతున్నారు.

కుడి కాలువకు రూ.2400 కోట్లు వెచ్చిస్తుండగా.. ప్రకాశం జిల్లాకు రూ.439.68 కోట్లు.. అందులో దర్శి, త్రిపురాంతకం, అద్దంకి, చీమకుర్తి సబ్‌డివిజన్లకు ఐదు ప్యాకేజీలుగా రూ.234.27 కోట్లు కేటాయించారు.

ఈ ప్యాకేజీల్లో ఇప్పటి వరకు 218 కోట్లు ఖర్చు చేశారు.  16.27 కోట్ల విలువైన పనులు ఆగస్టు లోపు పూర్తి కావాల్సింది.

అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు 196.68 కోట్లు కేటాయించారు. అందులో గత ఏడాది 78 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 118.68 కోట్ల విలువైన పనులు ఆగస్టులోపే కాంట్రాక్టర్లు పూర్తిచేయాల్సి ఉంది.  
 
ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మెయిన్ కాలువలకు 60 శాతం పనులు పూర్తి కాగా మేజర్ కాలువలకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. డబ్ల్యూఏ ప్రెసిడెంట్ పరిధిలో మైనర్ కాలువల మరమ్మతులకు ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు.

 చివరి భూములకు అందని నీరు...
 ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చివరి భూములకు నీరందే పరిస్థితి ఉండదు. ఖరీఫ్ పంటకు కాలువ నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఆధునికీకరణ పనులు ముందుకు సాగకపోవడంతో ఈ ఏడాది కూడా చివరి భూముల రైతులు నీటిపై ఆశలు వదులుకున్నారు.  ప్రధానంగా రజానగరం మేజరు, త్రిపురాంతకం మండలం ముడివేముల, దర్శి మండలం యర్ర ఓబనపల్లి మేజర్‌కు నీరందే పరిస్థితుల్లేవు. యర్ర ఓబనపల్లి మేజరుకు కాలువలు చేసినప్పటికీ నీరందక కాంట్రాక్టరు కాలువను పూడ్చివేశారు.

దానిని వెడల్పు చేయకుండా మళ్లీ చేస్తే ఆ కాలువ పనులకు బిల్లులు రావని ఆపడంతో గత ఏడాది రైతులు నిరందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో రావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఏదేమైనా ఆధునీకరణ పనులు ఆగ స్టులోపు పూర్తయితేనే రైతులకు పూర్తి స్థాయిలో నీరందుతుంది. లేకపోతే చివరి భూములకు నీరందడం క ష్టంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు చేసిన పనులు పూర్తి కాకుండానే మధ్యలోనే మరమ్మతులకు గురవుతున్నాయి.

మరిన్ని వార్తలు