పుట్టిన రోజునే నూరేళ్లు

21 Jun, 2014 02:29 IST|Sakshi
పుట్టిన రోజునే నూరేళ్లు

ఒక్కగానొక్క కొడుకు.. పేరేమో మౌలాలి.. వయస్సు రెండేళ్లు.. శుక్రవారం పుట్టినరోజు.. తమ ముద్దుల కొడుకు పుట్టినరోజును ఘనంగా చేయాలనుకున్నారు మౌలాలి తల్లిదండ్రులు.. కొత్త బట్టలు కొనిచ్చారు.. వాటిని వేసుకున్న కుమారుడిని చూసి మురిసిపోయారు.. సాయంత్రం కేక్ కట్‌చేసి తెలిసినవారందరినీ పిలవాలనుకున్నారు. సాయంత్రం  5గంటలకు కేక్ తెచ్చేందుకు మౌలాలి తండ్రి బజారుకు వెళ్లాడు. కేక్‌పై ‘హ్యాపీ బర్త్‌డే మౌలాలి’ అంటూ ముచ్చటగా రాయించుకుని ఇంటికొచ్చాడు.

మౌలాలి కనిపించడం లేదని భార్య చెప్పడంతో వీధులన్నీ వెతికారు. ఇంటి ఎదుట ఉన్న డ్రైనేజీలో మౌలాలి వేసుకున్న చొక్కా కనిపించడంతో అనుమానంతో పైకి తీశారు.. మౌలాలి కొన ఊపిరితో ఉన్నాడు.. గుండెలుబాదుకుంటూ రిమ్స్‌కు తీసుకెళ్లారు.. అప్పటికే మౌలాలి ఊపిరి ఆగిపోయినట్లు డాక్టర్ తెలిపాడు.  ‘బేటా మౌలాలి పుట్టినరోజే నీకు నూరేళ్లు నిండాయా’ అంటూ తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడున్నవారిని కదిలించింది.  
 
 కడప అర్బన్ :తమ కుమారుడి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలనుకున్నారు. కొత్త బట్టలు కొనిచ్చారు. శుక్రవారం సాయంత్రం తన కుమారుడిని ఇంటి వద్దనే వదిలి తండ్రి కేక్ తీసుకురావడానికి వెళ్లాడు. కేక్ తీసుకొని ఆనందంతో ఇంటికొచ్చిన ఆ తండ్రికి విషాదం మిగిలింది. కుమారుడు కనిపించలేదని భార్య చెప్పడంతో అందరూ కలిసి వీధులన్నీ వెతికారు. ఇంటి ముందరే డ్రైనేజీ గుంత తమ కుమారుడిని మింగేసిందని కనిపెట్టలేకపోయారు. పుట్టినరోజుకు తెచ్చిన చొక్కా గుంతలో కనబడడంతో అనుమానించి పైకి తీశారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై కుమారుడు కొన ఊపిరితో ఉన్నాడు. వెంటనే 108కు ఫోన్ చేశారు. స్పందించకపోవడంతో ఆటోలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పడంతో రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. గుండెలవిసేలా రోదిస్తూ గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని అశోక్‌నగర్‌లో మస్తాన్ తన భార్య ఆయేషా, కుమార్తె మస్తాని(5), కుమారుడు మౌలాలి(2)తో కలిసి జీవనం సాగిస్తున్నారు. వంటపని, బేల్దారి పని చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. శుక్రవారం తన కుమారుడు మౌలాలి రెండో పుట్టినరోజు కావడంతో కొత్త బట్టలు తీసుకొచ్చి తొడిగించారు. ఉదయం నుంచి హుషారుగా గెంతులేస్తూ తోటి చిన్నారులతో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా గడిపాడు. సాయంత్రం 5గంటల ప్రాంతంలో తండ్రితోపాటు ఆడుకుంటూ తిరిగాడు. తన అక్క మస్తానితో గెంతులేస్తూ ఆడుకున్నాడు. తండ్రి మస్తాన్ తాను కేక్ తెస్తానని నగరంలోకి వెళ్లాడు. కుమార్తె మస్తాని, కుమారుడు మౌలాలి ఆడుకుంటున్నారని తల్లి అనుకుంది. మస్తాన్ ఇంటికి రాగానే మౌలాలి కనిపించలేదని భార్య కంగారు పడుతూ మస్తానితోపాటు వెతకసాగింది. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. మౌలాలి ఇంటి ముందు ఉన్న డ్రైనేజీ గుంతలో పడి మునిగిపోయాడు. తర్వాత  చొక్కా కనిపించింది. వెంటనే బయటకు తీసి 108కు సమాచారం ఇచ్చారు. స్పందించకపోవడంతో వెంటనే ఆటోలో నగరంలోని ఓ ప్రైవేట్ చిన్నపిల్లల వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించిందని చెప్పడంతో రిమ్స్‌కు తీసుకెళ్లారు. అప్పటికే డాక్టర్లు మౌలాలి మృతిచెందాడని నిర్దారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ తమ కుమారుడిని చేతబట్టుకొని ఇంటికొచ్చారు.
 
ప్రాణం తీసిన డ్రైనేజి గుంత

పుట్టినరోజునే చిన్నారి మౌలాలి ప్రాణాన్ని డ్రైనేజి గుంత బలి తీసుకుంది. నగర పాలక సంస్థ వారు నెలరోజుల క్రితం ప్రొక్లైన్‌తో అశోక్‌నగర్‌లోని వీధులన్నీ పూడిక తీయించారు. మస్తాన్ ఇంటి ముందు డ్రైనేజి కాలువపై కొంత భాగాన్ని మూసివేయకుండా అలాగే వదిలేసి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే కడప ఎమ్మెల్యే అంజద్‌బాష శాసనసభ సమావేశాల్లో ఉండడంతో ఫోన్‌లో కుటుంబ సభ్యులను పరామర్శించారు.
 
 
 

మరిన్ని వార్తలు