-

పంట సిరులే లక్ష్యంగా..

25 Dec, 2019 04:54 IST|Sakshi

నాలుగు ప్రధాన వ్యవస్థలతో చిరు ధాన్యాల బోర్డు అనుసంధానం

విధి విధానాలు రూపొందిస్తున్న యంత్రాంగం

బోర్డు చైర్మన్‌గా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ!

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ సముచితమైన ధర, అదనపు విలువ జోడింపుతో అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రంలో చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు కానుంది. చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించి ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించే దిశగా ఈ బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. బోర్డు విధి విధానాలు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, అనుబంధ ఉత్పత్తులు వంటి అంశాలపై ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాల పరిశీలనకు మార్కెటింగ్, వ్యవసాయ శాఖాధికారులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటనలు చేసివచ్చారు. కేంద్ర సంస్థలతో సంప్రదింపులు జరిపారు. ఇంతకీ చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఏమిటి, దేనికి ఉపయోగపడుతుందనే దానిపై అధికార వర్గాలు ఏమంటున్నాయంటే...

వ్యవసాయ రంగానికి మంచి ఊపు
పంటల ఉత్పత్తి, శుద్ధి, ప్రతి ఉత్పత్తికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం చిరు ధాన్యాల బోర్డు ప్రధాన ఉద్దేశం. తద్వారా వ్యవసాయ రంగానికి, అందులో భాగస్వాములయ్యే వారికి ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడమే దీని పని. బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. పంటల ప్రణాళిక నుంచి ఆహార శుద్ధి వరకు, మార్కెటింగ్‌ మొదలు ఎగుమతుల వరకు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది. పరిశోధన, మార్కెటింగ్, ఎగుమతి సహా అంతర్లీనంగా ఉండే వాటన్నిటి మధ్య సమన్వయం, సహకారం ఉండేలా చూస్తుంది.

బోర్డు విధులు ఇలా..
ఏయే చిరు ధాన్యంతో ఏమేం చేయొచ్చో వాటన్నింటినీ గుర్తిస్తుంది. ఉదాహరణకు కొర్రలతో అన్నం మాత్రమే కాకుండా ఎన్ని రకాల వంటకాలు, ఇతర పదార్థాలు చేయవచ్చో ఈ బోర్డు గుర్తిస్తుంది. ఉత్పత్తిదారులకు వివరిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఏయే రకాల చిరు ధాన్యాలు పండించవచ్చో ప్రణాళికను తయారు చేయడంతో పాటు ఆచరణాత్మక పద్ధతుల్ని రూపొందిస్తుంది. గ్రామ స్థాయిల్లో వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేస్తుంది. సేకరణ, మార్కెటింగ్‌లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే జోక్యం చేసుకుంటుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల ప్రమాణాలు ఉండేలా రైతులకు అవగాహన కల్పిస్తుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేలా ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రైవేట్‌ భాగస్వాములతో కలిసి ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా చూస్తుంది. సమర్థమైన మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను ప్రోత్సహిస్తుంది.

వ్యవస్థ ఎలా ఉంటుందంటే..
ఇది నాలుగు ప్రధాన వ్యవస్థలతో అనుసంధానమై ఉంటుంది. పరిశోధన, విస్తరణ, మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్, వాణిజ్యం పెంపుదల, గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఇతర యంత్రాంగం, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌ వంటివి ఇందులో ఉంటాయి. ప్రతి వ్యవస్థకు నిర్ధిష్టమైన పని విభజన ఉంటుంది. వీటితో పాటు బోర్డు ప్రస్తుతం వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయాలు, మార్కెటింగ్‌ ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉన్న సౌకర్యాలను, మౌలిక వసతులను వినియోగించుకుంటుంది. ఈ బోర్డుకు ఎవర్ని చైర్మన్‌గా నియమించాలనేది ఖరారు కానప్పటికీ ఎంఎల్‌ఏ లేదా ఎమ్మెల్సీ చైర్మన్‌గా ఉంటారని భావిస్తున్నారు. వైస్‌ చైర్మన్‌గా రైతు నాయకుడు ఉంటారు. విస్తరణ, మార్కెటింగ్, స్టోరేజి, మౌలిక వసతులు, ప్రాసెసింగ్, వ్యాపార–వాణిజ్య వర్గాల నిపుణులు, వ్యవసాయ రంగం నుంచి ఒక రైతు, ఇతర భాగస్వామ్య పక్షాల వారు బోర్డులో ప్రతినిధులుగా ఉంటారు.

మరిన్ని వార్తలు