మా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి

1 Mar, 2018 11:52 IST|Sakshi
చిన్నారి కాలేయమార్పిడికి సహకరించాలని కోరుతున్న తల్లి

ఏడు నెలలుగా కాలేయ సమస్యతో బాధపడుతున్న చిన్నారి

శస్త్రచికిత్స చేయించినా ఫలితం శూన్యం

కాలేయ మార్పిడి చేయాలన్న వైద్యులు

దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

అమృతవారిపల్లె(ఓబులవారిపల్లె) : మండలంలోని అమృతవారిపల్లె గ్రామానికి చెందిన తలపల సుభాషిణి, తలపల వెంకటేష్‌ దంపతులకు మూడవ సంతానం దేవాన్ష్ (12 నెలలు). పుట్టిన మూడు నెలల నుంచి కడుపు ఉబ్బుతుండటంతో తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాలేయవ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. అప్పటినుంచి చికిత్స చేయిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం తమిళనాడు లోని రాయవేలూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిం చారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే వెంకటేష్‌ సుమారు రూ.3లక్షలు ఖర్చుచేసి వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో కాలేయానికి శస్త్రచికిత్స చేయించారు. అయినా కాలేయ సమస్య తగ్గకపోవడంతో మళ్లీ వేలూరు సీఎంసీకి వెళ్లమని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు.

అప్పుచేసి దేవాన్ష్ కు వైద్యం చేయించినా ఫలితం లేకపోగా.. మళ్లీ వైద్యం చేయించే స్థోమత లేకపోయినా..బిడ్డను బతికించుకోవాలనే తపనతో హైదరాబాద్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే కాలేయ మార్పిడి చేసేందుకు రూ.25లక్షలు ఖర్చు అవుతుందని వీలైనంత త్వరగా చేయించాలని వైద్యులు తెలపడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇంటికి చేరుకున్నారు. అప్పటినుంచి కాలేయ మార్పిడికి ఒక్కసారిగా అంత డబ్బులు లేకపోవడంతో చికిత్స చేయించలేక ఇంటివద్దనే ఉంటూ మందులు వాడుతున్నారు. దేవాన్ష్ ఏమి తిన్నా కూడా కడుపు ఉబ్బి పెద్దది అవుతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. చిన్నారి కాలేయమార్పిడికి దాతలు సహకరించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు