కాకినాడకు కొత్త యోగం!

31 Jul, 2015 02:17 IST|Sakshi
కాకినాడకు కొత్త యోగం!

- స్మార్ట్‌సిటీపై నగరవాసుల ఆశలు
- ఎంపికైతే కార్పొరేషన్‌కు నిధుల వరద
- ఏటా రూ.500 కోట్ల కేంద్ర గ్రాంటు
కాకినాడ :
రేవు కార్యకలాపాలు, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రం కాకినాడను ‘స్మార్ట్‌సిటీ’ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం నగరవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉన్న కాకినాడకు ఈ ప్రాజెక్టు దక్కితే నిధుల వరద పారనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉందని, అన్నీ కలిసి వస్తే ఏటా రూ.500 కోట్ల వరకు ఐదేళ్ళపాటు నిధులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
 
దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌నుంచి మూడు నగరాలకు ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు విశాఖ, తిరుపతితోపాటు కాకినాడ నగరాన్ని కూడా ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దాదాపు 15 అంశాలను కొలమానంగా తీసుకుని ఈ మూడు నగరాలను ఎంపిక చేసినప్పటికీ కేంద్రస్థాయిలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం ప్రతిపాదనలు పంపారు.
 
ఎంపికకు ఇదీ కొలమానం..
స్మార్ట్‌సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, ఇ-గవర్నెన్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయవ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా పన్నుల వసూళ్ళతోపాటు క్రమం తప్పని ఆడిట్, సకాలంలో జీతాల చెల్లింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
 
ఎంపికైతే ఇవీ లాభాలు..
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడకు భారీస్థాయిలో వనరులు సమకూరనున్నాయి. ప్రధానంగా ఏడాదికి రూ.500 కోట్ల వరకు కేంద్రంనుంచి నిధులు అందే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే అదంతా గ్రాంటా? నగరపాలక సంస్థ భాగస్వామ్యం కూడా ఉండాలా?  అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడ మరింత ప్రగతిపథంలో పయనిస్తుందంటున్నారు. అయితే కేంద్రస్థాయిలో తుది నిర్ణయం వెలువడేందుకు సమయం పడుతుందని కార్పొరేషన్‌వర్గాలు చెబుతున్నాయి.
 
టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
ప్రతిపాదనల దశల్లో ఉన్న కాకినాడ స్మార్ట్‌సిటీపై ప్రభుత్వం ప్రత్యేకటాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, నగర పాలక సంస్థ కమిషనర్ మెంబర్ క న్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జాతీయ రహదారుల విభాగం, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులు, భవనాలు, వివిధశాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరంతా పథకాన్ని సమర్థంగా అమలు చేసే అంశంపై సమన్వయం చేయనున్నారు.

మరిన్ని వార్తలు