స్మార్ట్ విలేజ్‌లకు ప్రతిబంధకాలు

9 Feb, 2015 02:14 IST|Sakshi

గుంటూరు సిటీ :  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలను స్మార్ట్ విలేజ్‌ల జాబితాలో చేర్చారు. అయితే రాత్రికి రాత్రే స్మార్ట్‌గా మారిపోవన్న వాస్తవాన్ని మాత్రం మరిచారు.
 
 జిల్లాలోని 1,111 గ్రామాల్లో కనీస వసతులు లేని కుగ్రామాలు కొన్నయితే, మౌలిక సదుపాయాలు మచ్చుకైనా కనిపించని మారుమూల పల్లెలు మరికొన్ని. వీటినలా ఉంచితే, ఒక గ్రామం స్మార్ట్‌గా కనిపించాలంటే ముందుగా అక్కడి వాతావరణం  పరిశుభ్రంగా ఉండాలి. దానికి అనుగుణంగా పారిశుద్ధ్యం మెరుగుప డాలంటే ఆయా గ్రామాల్లో పోగుపడే చెత్తా చెదారాన్ని ఎప్పటి కప్పుడు ఎత్తి గ్రామంలోని ఏదో ఒక ఖాళీ ప్రాంతానికి తరలి ంచాలి. అక్కడ చెత్తను తడి-పొడిగా విడగొట్టి రీసైక్లింగ్ చేయాలి. ఇవన్నీ జరగాలంటే ప్రతి గ్రామానికీ ఓ డంపింగ్ యార్డు అవసరమనే విషయాని ప్రాథమికంగా గుర్తించాలి.
 
  జిల్లాలోని సగం గ్రామాల్లో డంపింగ్ యార్డులే లేవు. జిల్లా పంచాయతీ అధికారుల లెక్క ప్రకారం 138.68 ఎకరాల్లో డంపింగ్ యార్డులుండాలి. వీటిలో 105 మాత్రమే వెలుగుచూసి అంతో ఇంతో ఉపయోగపడుతున్నాయి. మిగిలినవి ఎక్కడున్నా యో కూడా అధికారులకూ తెలియదు. రికార్డుల్లో కనిపిస్తున్నా  ఉనికి మాయమైంది.
 
 ప్రస్తుతం స్మార్ట్ విలేజ్‌ల హడావుడి నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పంచాయతీ అధికారి వీరయ్య వాటి ఆచూకీ తీయడానికి తాజాగా ఉపక్రమించారు. అన్ని డంపింగ్‌యార్డులను వెలికితీయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న సర్వే నంబర్ల ఆధారంగా వాటి చిరునాఇఇమాను 10వ తేదీ లోగా గుర్తించి వాడకంలో పెట్టాలని గడువు విధించారు. గుర్తించిన వాటిని గ్రామ పంచాయతీ అడంగల్‌లో నమోదు చేసి విధిగా రెవెన్యూ రికాార్డుల్లో సైతం డంపింగ్‌యార్డు స్థలంగా మార్పుచేయాలని సూచించారు. అలా చేయడంలో విఫలమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. ఇది సవ్యంగా జరిగినా కూడా ఇంకా సగం గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం స్థల సేకరణ జరగాల్సి ఉంది. గ్రామ కంఠంలో దీనికి అవసరమైన జాగా ఉందా లేదా? అన్నది సరి చూసుకోవాల్సి ఉంది. అన్నీ కుదిరితే కానీ ప్రతి గ్రామానికీ ఒక డంపింగ్ యార్డు నెలకొల్పలేని పరిస్థితి. ఇక మేజర్ గ్రామ పంచాయతీలో రెండు యార్డులు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు హైరానా పడుతున్నారు.
 
 ఎన్‌ఆర్‌జీఎస్ కింద నిధులు ...
 జిల్లాలోని చాలా గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏ స్థితిలో ఉన్నాయో లెక్క తేలలేదు. 138.68 ఎకరాల్లో ఉండాల్సిన 577 డంపింగ్ యార్డులకు 105 మాత్రమే గుర్తింపునకు నోచుకున్నాయి. మిగిలినవి ఎలా ఉన్నాయో, ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంది. అందుకే వీటిని తక్షణం గుర్తించమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాను. గుర్తించిన తర్వాత వాటిని వాడకంలో పెట్టేందుకు వీలుగా మరమ్మతులు చేపట్టడానికి ఎన్‌ఆర్‌జీఎస్ కింద కేంద్రం ఒక్కొక్క డంపింగ్‌యార్డుకు రూ. 1.28లక్షలను మంజూరు చేసింది. వాటితో యార్డు చుట్టూ ఫెన్సింగ్, చెత్త వాహనాల రాకపోకలకు వీలుగా వసతులు కల్పిస్తాం. ముందుగా గుర్తించిన వాటిలో పని పూర్తయిన తర్వాత ఇక కొత్తగా ఏర్పాటు చేయాల్సిన డంపింగ్ యార్డులపై దృష్టి సారిస్తాం.
 - వీరయ్య, జిల్లా పంచాయతీ అధికారి.
 

>
మరిన్ని వార్తలు