స్మార్ట్ విలేజ్‌లు...సాధ్యమయ్యేనా?

19 Jan, 2015 04:52 IST|Sakshi
  • ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేదు
  • ఎన్‌ఆర్‌ఐలు, గ్రామ ప్రముఖుల నుంచే విరాళాల సేకరణ
  • పంచాయతీకో ప్రత్యేక అధికారి
  • ప్రతి గురువారం సమీక్ష
  • పనిభారంతో సతమతమవుతున్న కార్యదర్శులు
  • ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేస్తేనే గ్రామాల అభివృద్ధి అంతంతమాత్రంగానే జరుగుతున్న తరుణంలో.. నూతనంగా తెరపైకి తెచ్చిన స్మార్ట్ విలేజ్‌లు, వార్డుల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల లేకుండా విరాళాలు సేకరించి గ్రామాల్లో సౌకర్యాలు సమకూర్చడం సాధ్యమయ్యేనా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆదివారం ఆర్భాటంగా ప్రారంభించిన స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ముందడుగు వేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
     
    మచిలీపట్నం : ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయకపోగా స్థానికంగానే సమకూర్చుకోవాలని చెప్పడం, దీని కోసం పంచాయతీ, వార్డుకు ఒక గెజిటెడ్ అధికారిని నియమించడం గమనార్హం. ఈ కార్యక్రమంపై ప్రతి గురువారం సమీక్ష నిర్వహిస్తామని, విరాళాలు ఇచ్చే ఎన్‌ఆర్‌ఐలు, స్థానికంగా ఉన్న గ్రామ ప్రముఖుల వివరాలు, వారి ఫోన్ నంబర్లు ముఖ్యమంత్రి మెయిల్ ఐడీకి ఆన్‌లైన్ ద్వారా పంపితే నేరుగా వారితో తానే మాట్లాడి నిధులు సమకూర్చుతానని ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

    టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కొత్తగా ఒక్క గృహాన్నీ నిర్మించలేదు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో అందరికీ గృహాలు సమకూర్చడంతో పాటు మరుగుదొడ్లు, రక్షిత నీరు కల్పిస్తామని ప్రకటిస్తున్నారు. స్మార్ట్ విలేజ్, వార్డు కార్యక్రమంలో 20 లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. మరుగుదొడ్లు నిర్మిస్తే ఒక్కొక్క దానికి రూ.12 వేలు ఇస్తామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు స్థానికంగానే నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడంతో నిధులు ఎక్కడి నుంచి సమకూర్చాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

    గ్రామాల్లో అన్ని రోడ్లకు బ్రాడ్‌బ్యాండ్ వైర్లను వేసి ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వాలనే లక్ష్యాన్ని స్మార్ట్ విలేజీలో నిర్దేశించారు. ఇది సాధ్యమయ్యే పని కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. చాలా పాఠశాలల్లో తాగునీటి కుండీలు ఉన్నా నీరు అందుబాటులో లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. నిధుల సమీకరణ కోసం రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు, వారి ఫోన్ నంబర్లు సేకరించాలని ప్రభుత్వం అధికారులకు హుకుం జారీ చేయడం గమనార్హం.
     
    పని ఒత్తిడితో సతమతం

    ప్రస్తుతం పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు జరుగుతున్నాయి. ఏరోజు ఎంతమేర ఇంటి పన్ను వసూలు చేశారో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదిక పంపాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా పంచాయతీ నుంచి ఇంటి పన్ను వసూళ్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచకుంటే ఆరోజు సంబంధిత పంచాయతీ కార్యదర్శి పనిచేయనట్లుగా భావిస్తున్నారు. ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి మూడు నుంచి నాలుగు పంచాయతీలను పర్యవేక్షించాల్సి వస్తోంది. వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వీడియోకాన్ఫరెన్స్‌లు, వివిధ రకాల సమావేశాలకే సమయం సరిపోతోంది.
     
    ఇలాంటి తరుణంలో స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఏ పనిచేయాలో తెలియక సతమతమవుతున్నామని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పంచాయతీకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని నియమించగా ఆయనే ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా పరిగణిస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు, గ్రామ ప్రముఖుల నుంచి నిధులు సమకూరని నేపథ్యంలో సంబంధిత అధికారిని బాధ్యులుగా చేస్తారా అనే అనుమానాలు అధికారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు