పబ్‌ జీ.. యే క్యాజీ..!

22 Jul, 2019 12:41 IST|Sakshi

యూత్‌ను స్మార్ట్‌ఫోన్‌ మోజులో పడేసిన పబ్‌జీ

24 గంటలు మొబైల్‌తోనే సహవాసం

ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్న స్మార్ట్‌ఫోన్‌ గేమ్స్‌

పబ్‌ జీగేమ్‌కు దూరంగా ఉండాలంటున్న మానసిక నిపుణులు

పబ్‌ జీ, ఫ్రీ ఫైర్‌ గేమ్స్‌.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న వారిలో ఈ ఆటల గురించి తెలియని వారుండరు. ప్రధానంగా యువతను ఉర్రూతలూగిస్తున్న ఆన్‌లైన్‌ ఆటలివి. కొందరు చిన్నారులు, యువకులు నిద్రాహారాలు మానేసి ఈ ఆటలకు బానిసలవుతున్నారు. సరదాగా మొదలై అతి తక్కువ కాలంలోనే యువతను తనకు బానిసను చేసుకుంటున్న క్రీడ. తమకు తెలియకుండానే పబ్‌జీ గేమ్‌కి అంకితమవుతున్న యువత మానసికంగా, శారీరకంగా స్థిమితాన్ని కోల్పోతున్నారు. ఆట వద్దని చెబితే విచక్షణ కోల్పోయి హత్యలు, ఆత్మహత్యలకు సైతం వెనుకాడటం లేదు. ఈ ఆట కారణంగా మానసిక వ్యాధులు, మరి కొందరి సంసారాల్లో విడాకులు, చాలా కుటుంబాల్లో పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అందుకే ఈ క్రీడను గేమింగ్‌ డిజార్డర్‌గా గుర్తించారు. ప్రస్తుతం భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడుతున్న యువతలో 60 శాతం మంది నిత్యం పబ్‌జీ గేమ్‌ ఆడుతున్నట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గుర్తించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   – బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు)

పబ్‌ జీ అంటే ప్లేయర్‌ అన్‌నోన్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్, పూర్తిగా ఆన్‌లైన్‌ వేదికగా సాగే ఆట ఇది. 2018లో ఈ గేమ్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్‌ సంస్థ దీనిని యాప్‌లా తయారు చేసింది. యాప్‌ను ఫోన్‌లో వేసుకొని ప్రారంభించగానే ఎంత మందితో ఆడాలో నిర్ణయించుకోవాలి. ఆన్‌లైన్‌లో స్నేహితులంతా జట్టుగా ఏర్పడతారు. ఆ సమయంలో స్నేహితులంతా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా 50 మంది ఆడవచ్చు. ఎంచుకున్న జట్టు తప్ప మిగతా వారంతా శత్రువుల కిందే లెక్క శత్రువులను తుపాకులతో, బాంబులతో చంపడమే లక్ష్మంగా ఆట సాగుతుంది. ప్రత్యేకమైన సైనికుల తరహాలో వేణధారణలలో కూడిన జట్టు పరస్పరం దాడులు చేసుకుంటూ యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. ఆటగాడు చనిపోతే ఆతడి గేమ్‌ ముగుస్తుంది. ఎలాగైనా అందరినీ చంపి గెలవాలనన తపనతో ప్రతి సారీ యువత మళ్లీ గేమ్‌లోకి ప్రవేశించి ప్రారంభిస్తారు. ఈ గేమ్‌లో ఒకే సారి మనకు తెలిసిన వారితో కలిపి ఆడే అవకాశం కూడా ఉంది. అలా ఆడటం వల్ల చివరి వరకు వారు మిగిలిన వాళ్లను చంపి గేమ్‌ తుది దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.ఈ క్రమంలో నిద్రాహారాలు, మానేసి పబ్‌ జీ ఆటకు బానిసలుగా మారుతున్నారు. 

పెరుగుతున్న నేర ప్రవృత్తి
పబ్‌ జీ ఆటలో ఉండేది మొత్తం నేరప్రవృత్తే. ఎదుటి వారిని తుపాకులతో కాల్చడం. బాంబులు వేసి చంపడమే లక్ష్యంగా సాగుతోంది. దీంతో పబ్‌జీలో ఉన్నట్లుగానే నేర ప్రవృత్తికి అలవాటు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్‌కు బానిసై చదువు చదవడం లేదని ఢిల్లీకు చెందిన సురాజ్‌ను అతడి తల్లిదండ్రులు మందలించారు. దీంతో సురాజ్‌ వారి కుటుంబాన్ని మొత్తం హత్య చేసిన ఘటన దేశంలో ప్రకంపనలు సృష్టించింది.  ఈ గేమ్‌ వల్ల ఎందరో చనిపోతున్నారు.. మరి కొందరు గొడవులు పడి దూరం అవుతున్నారు. పబ్‌జీ ఆడకపోతే నిమిషం నిలువ లేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. పబ్‌జీ ఆటకు బానిసలై వింతగా ప్రవర్తిస్తున్న ఎందరో యువకుల వీడియోలు సోషల్‌ మీడియోలొ చక్కర్లు కొడుతున్నాయి.

విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఆటల మూలంగా విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారనే ఫిర్యాదులు పెరిగాయి. ఈ ప్రభావం పరీక్షలపై కూడా పడుతుంది. పది, ఇంటర్, డిగ్రీ ఫలితాల్లో ఎంతో మంది విద్యార్ధులు ఫెయిల్‌ అవుతున్నారు. గేమ్‌లో మునిగిపోయి చదువుకోవడానికి సమయం కేటాయించకపోవడమే ఇందుకు కారణం. విలువైన సమయాన్ని యువత వృథా చేస్తుండటం వల్ల పరీక్ష ఫలితాలు తారుమారై తల్లిదండ్రులకు నిరుత్సాహం మిగుల్చుతున్నారు. పబ్‌ జీకి బానిసలుగా మారిన పిల్లలను మామూలు స్థితికి తెచ్చేందుకు మానసిక నిపుణులు సంప్రదిస్తున్న కేసులు పెరిగుతున్నాయి..

తల్లిదండ్రులు గమనించాలి
మొబైల్‌ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక స్థితిని గమనించాలి. యూత్‌ స్మార్ట్‌ఫోన్లలో రకరకాల వీడియో గేమ్స్, నిషేధిత వెబ్‌సైట్స్‌ చూసి ఆకర్షితులవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తెలిసీతెలియని వయస్సులో ఇలాంటి ఆటలకు ఆకర్షితులైతే వారిలో నేరప్రవృత్తి పెరుగుతుంది. శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. అదే పనిగా వీడియో గేమ్స్‌ ఆడుతుంటే కళ్లకు ప్రమాదం ముంచుకొస్తుంది. ఆలోచన, విచక్షణ శక్తిని కోల్పోతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వవద్దు. ఇచ్చిన వారు పక్కనే ఉండి ఫోన్‌లో ఏం చూస్తున్నారో, చేస్తున్నారో గమనించాలి. మొబైల్‌కు బానిసలైన కేసులు నెలకు మూడు నాలుగు వస్తుంటాయి. వారికి సరైన కౌన్సెలింగ్‌ ఇచ్చి సాధారణ పరిస్థితికి తీసుకొని రావటం జరుగుతుంది.   –డాక్టర్‌ సునీత, మానసిక నిపుణరాలు

చాలా చోట్ల నిషేధం
పబ్‌ జీతో ఎదురవుతున్న దుష్పరిణామాలను గుర్తించిన చైనా దేశం ఈ ఆటను పూర్తిగా నిషేధించింది. మన దేశంలోని గుజరాత్‌ ప్రభుత్వం సైతం పాఠశాలల్లో ఈ ఆటను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ గేమ్‌ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ కేంద్రానికి గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల సిఫార్సు చేసింది. దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ ఆటను ఒక ఖాతాదారుడు కేవలం 6 గంటలు మాత్రమే ఆడేలా పరిమితి విధించారు. అయినా యువత ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను సృష్టించుకొని  గంటల తరబడి ఆడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మాయదారి క్రీడను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతుంది లేదంటే ఎందరో ఈ మృత్యుక్రీడ కారణంగా తమ విలువైన జీవితాలను కోల్పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు